YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము *

*మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము *

*మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము *
*ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు
*మహా మృత్యుంజయ మంత్రం:*
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్  ముక్షీయ మామృతాత్ 
ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము;  త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు;  మృత్యోర్  = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.
తాత్పర్యం:  అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!
ప్రాశస్త్యము: 
మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.
తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. ఆమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక."*
మహా మృత్యుంజయ మంత్రాన్ని ఉచ్ఛరిస్తే భయాలుండవు. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది. 
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి,  ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.
‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది.
వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుకమివ బంధనం’లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. 
పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.
వయసు పడమటికి వాలేటప్పటికి, ప్రతి మనిషీ పసివారి మాదిరే తాను నిర్మించుకొన్న జీవితంపై పట్టు వదిలించుకోవాలి. తుది పిలుపు చెవిన పడేవరకు వదులుగా ఉంచుకోవాలి. ఆ సమయం రాగానే, దోసపండు మాదిరే పాత చిహ్నాలేవీ మిగలకుండా ప్రపంచం అనే తీగ నుంచి విడిపోగలిగిన స్థితికి రావాలి. పసిపిల్లల ధోరణిలోనే ‘మరో గుడి కట్టుకుందాంలే’ అన్నంత ధీమాతో ఈ శిథిలాలయాన్ని నిర్మూలనకు వదిలేయాలి.
సునాయాసంగా మరణించాలని కోరుతూ చేసే ప్రార్థనను పెద్దలు ‘మృత్యుంజయ మంత్రం’గా ప్రకటించడం ఓ విశేషం! ఆ రహస్యం బోధపడితే, మృత్యువును ఆహ్వానించగల స్థితికి మనిషి చేరుకోగలడు. మృత్యువును జయించడం అంటే- చావు లేకుండాపోవడం కాదు... మృత్యుభీతిని జయించడం!
ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె
ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. 
‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు.
మనుషులందరూ దానికి అర్హులే!
*శివతత్వం
మానవ శరీరం ఏర్పడినపుడు అది కేవలం ఒకే ఒక కణం మాత్రమే. ఆ ఒక్క కణమే మొత్తం శరీరంగా మారింది. శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో, ఎక్కడ చెవులుగా ఏర్పడాలో, ఎక్కడ గుండెగా పనిచేయాలో.. అన్నీ ఆ కణానికి తెలుసు. అలా ఆ ఒక్క కణమూ తనను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా.. గోళ్లు, జుట్టు, నాలుక, కండరాలు, ఎముకలు ఇలా అన్నిటిగానూ రూపొందింది. మానవ శరీరం ఒక్కటే.. కాని ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం.. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్ని ఒకే పదార్థంతో తయారయ్యాయి. ఆ ఒక్కదానికే ‘శివ’ అని పేరు. 
శివతత్వాన్ని గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే.
శివుడు విశ్వరూపుడే. అంటే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరాకారుడు. 
విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్లినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా? అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. శివరాత్రి గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు. ‘నీవు శివుని పాదాలు కనుక్కో.. నేను తలను కనుగొంటాను’ అని బ్రహ్మ చెప్పాడు. సరేనని విష్ణువు.. శివుని పాదాలు వెదుకుతూ పాతాళానికి బయల్దేరాడు. బ్రహ్మ ఆకాశమార్గాన పైకి వెళ్లాడు. కొన్ని వేల సంవత్సరాలపాటు గాలించినా పరమేశ్వరుడి ఆద్యంతాలు వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే సృష్టంతా శివునిలోనే ఉన్నది.
ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది. ఒకవంక అతడు శ్వేత వస్త్రధారుడిగా అగుపిస్తాడు. మరోవంక కృష్ణవర్ణుడు. అతడు విశ్వానికి అధిపతి అయినా ఆభరణాలు లేవు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు భోళాశంకరుడు. 
సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతి. అదేసమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతనే.
ఆనందతాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగునూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతున్నది. 
సాధారణంగా ప్రజలు, ‘ఈ జీవితం ఉద్దేశం ఏమిటి? ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది?’ అని అడుగుతూ ఉంటారు. ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వసృష్టికి కారణం లేదు.
ఇది కేవలం ఒక లీల. విశ్వ చైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడిగా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. 
ఈ సత్యమే నటరాజస్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతములు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనందనాట్యమే ఈ విశ్వం. ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటోంది. ఇది తెలియనివాడు బాధపడతాడు. తెలిసినవాడు ఆనందాన్ని కనుగొంటాడు. ఆ సత్యమే శివతత్వం.శివుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు. శివతత్వం ఇక్కడే ఉంటుంది. 
మన చైతన్యంలో మూడు దశలు ఉంటాయి. *మెలకువ, *కల, *నిద్ర. ఇవిగాక నాల్గో దశ *చైతన్యస్థితి ఉన్నది. అది మెలకువ కాదు. కల కాదు. నిద్ర కూడా కాదు. అది ధ్యానంలో అనుభవంలోకి వస్తుంది. 
ఆ నాల్గోస్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివతత్వం. చైతనత్వంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది. జీవం ఉన్న ప్రతిదానిలోనూ ఆ తత్వం ఉన్నది. ఆ *మహత్తే శివతత్వం. 
*ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం* 
*ఉర్వారుకమివబంధనాన్‌ మృత్యోర్ముక్షియమామృతాత్*
వేదాచారాలలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో శివుని మృత్యుంజయ మంత్రం ఒకటి.
* మృత్యుంజయ అంటే చావుపై గెలుపు. ఆత్మకు చావు లేదు. అది ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. మృత్యుంజయ అంటే ఈ అశాశ్వతమైన జీవనంపై గెలిచి, మనసు శాశ్వతత్వానికి చేరుకోవడం. 
*‘నేను శాశ్వతం, ఎన్నటికీ మార్పు చెందనిదేదో అది నాలో ఉన్నది’* అని మనసు గ్రహిస్తుంది. 
అప్పుడు భయం ఉండదు. భయం అనేది మృత్యువుకు గల సంకేతాలలో ఒకటి. భయాన్ని జయించినపుడు ఈ అశాశ్వతమైన విషయాలను గుర్తుంచుకోవడం మానేసి, ఎన్నటికీ నాశనం కాని దానికోసం కదులుతాము. 
మనం ఈ రెండింటి కలయికగా ఉన్నాము. మన ఆత్మ నాశనం లేనిది. శరీరం నశించిపోయేది. చాలాసార్లు మన మనసు శరీరానికి అంటిపెట్టుక
ుని తాను చనిపోతున్నానని భావిస్తూ ఉంటుంది. మనసును ఈ పరిమితమైన గుర్తింపు నుంచి అపరిమితమైన విశ్వవ్యాప్తమైన గుర్తింపుకు మృత్యుంజయ మంత్రం తీసుకెళ్తుంది. 
ఈ మంత్రంలో ఒక ప్రార్థన ఉన్నది. *‘శివుడు నన్ను బలవంతునిగా చేయుగాక. ఆతడు నన్ను బలవంతునిగా చేయుగాక. ఆతడు నన్ను బంధం నుంచి విముక్తుణ్ని చేయుగాక’’.*

ఈ మంత్రాన్ని ఎలా జపించాలంటే...?ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది. 
మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత:
మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రం వలె మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం ఒక విధమైన మృత సంజీవని అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆపదలు కలిగినపుడు కూడా చదువుకోవచ్చు. సాధారణంగా మూడుసార్లు కానీ, తొమ్మిది సార్లు గానీ బేసి సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.

Related Posts