ఏడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు
కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,
రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3 డి ప్రింటింగ్
హైద్రాబాద్, డిసెంబర్ 30,
మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదరణలేని సంప్రదాయ కోర్సులకు స్వస్తి పలుకుతూ కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించే కోర్సుల సీట్లను పెంచుకుంటున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో 13 కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి బ్రాంచిలకు అదనపు సీట్లను అనుమతులు లభించాయి. ఒక్కో కళాశాలలో 60 అదనపు సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లు ఈ సారి అందుబాటులోకి వచ్చాయి. డిమాండ్ లేని బ్రాంచిలలో సీట్లు తగ్గించుకుని ఉపాధికి ఉపయోగపడే స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్న సంప్రదాయక ఇంజినీరింగ్ కోర్సులకు 2020– 21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఆదరణ లేని కోర్సులను వదిలించుకుని కొత్త కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.కొత్తగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3 డి ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్ విద్యలో అనుమతిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గుర్తించిన ఎంహెచ్‌ఆర్‌డి ఆ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతగా డిమాండ్ లేని సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు స్వస్తి పలికేందుకు సిద్దమవుతోంది.సంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచీలకు డిమాండ్ తగ్గి సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. టాప్ కళాశాలల్లో సైతం పలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. డిమాండ్ లేని బ్రాం చీలను వదిలించుకుని ఎక్కువగా డిమాండ్ ఉండే బ్రాంచీలలో సీట్లు పెంచుకుంటూ కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్‌తో ఉండే నూతన కోర్సులు ప్రారంభిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో ఏడు ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(విజెఐటి), సివిఎస్‌ఆర్ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ఒక్కో కళాశాలలో 60 సీట్లు అం దుబాటులోకి రాగా, విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ కోర్సులో 60 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా తదితర నూతన సబ్జెక్టుల కాం బినేషన్‌లో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కోర్సుకు ఈ ఏడాది 60 సీట్లు అందుబాటులోకి ఉన్నాయి. సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి కాంబినేషన్‌లో 60 సీట్లు, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సైన్స్(కిట్స్)లో ఎలక్ట్రానిక్స్ కమ్యునికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులో, కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్‌వర్కింగ్ కోర్సులు అందుబాటులోకి రాగా, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజి అండ్ ఇంజనీరింగ్ కోర్సులో 60 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సారి అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సుల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి.జవహార్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజి యూనివర్సిటీ, హైదరాబాద్(జెఎన్‌టియుహెచ్)లో గత విద్యాసంత్సరం వరకు అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ ఎంబిఎకు స్వస్తి పలికారు. జెఎన్‌టియుహెచ్‌లో ఇంజనీరింగ్ కాంబినేషన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంబిఎలో 75 సీట్లు, ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ కోర్సులో 75 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ సారి ఇంటిగ్రేటెడ్ ఎంబిఎ సీట్లను ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ కోర్సులో కలిపారు. ఐదు బ్రాంచిలలో ఒక్కో బ్రాంచికి 15 సీట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ ఎంబిఎ సీట్లను ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ కోర్సులు కొనసాగాయి. సుమారు గత పది సంవత్సరాలుగా ప్రవేశాలు నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఎంబిఎ కోర్సుకు అంతగా ఆదరణ లేకపోవడంతో ఆ కోర్సులో ఉన్న సీట్లను డిమాండ్ ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ కోర్సులో కలిపారు.