లక్ష్యాన్ని మించిన ధాన్యం సేకరణ
నిజామాబాద్, డిసెంబర్ 30
ఖరీఫ్‌లో పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షల మంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ సారి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధర (గ్రేడ్-ఎ క్వింటాల్‌కు రూ. 1970, సాధారణ రకం- క్వింటాల్‌కు రూ.1950)కు 6.71 లక్షల మంది మంది రైతుల నుంచి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు, నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నది. గతేడాది ఖరీఫ్‌లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు కాగా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. అలాగే ఈసారి పురుగులు ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. పంటకు కనీస మద్ధతు ధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయిం చాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్గొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. కాగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుంచి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.5,213 కోట్లు ఆన్‌లైన్ ద్వారా రైతు ఖాతాలోకి జమచేశారు. మిగి లిన మొత్తాన్ని ట్రాక్‌షిట్ జనరేట్ అయినవెంటనే జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారు లతోపాటు ఇతర విభాగాల అధికారులతోనూ పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకుపోయా మన్నారు. ఖరీఫ్‌లో 25 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 34 లక్షల టన్నులు సేకరించామని తెలిపారు. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచన ఉన్నదని అన్నారు. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. తుపాను ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందిగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి చేశామని తెలిపారు.
నాలుగేండ్లలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఇలా..
ఏడాది కొనుగోలు కేంద్రాలు ధాన్యం (టన్నుల్లో)
2015-16 1,639 11.03 లక్షలు
2016-17 1,721 15.13 లక్షలు
2017-18 2,178 16.47 లక్షలు
2018-19 2,716 18.24 లక్షలు