ఐదేళ్లలో ఇస్రోకు 1250 కోట్లు
నెల్లూరు, డిసెంబర్ 30,
ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్‌ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవం తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది.విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహా ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది.1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్‌ఎల్‌వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్‌ఎల్‌వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు.రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్‌కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది.