. అడ్డూ, అదుపు లేకుండా నైజీరియన్ల మోసాలు
హైద్రాబాద్, డిసెంబర్ 30, )
నైజీరియన్ల సైబర్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వలవిసిరి భారీగా డబ్బు దోచేస్తున్నారు. తాజాగా, ఓ నైజీరియన్ తెలిసిన వ్యక్తిగా హైదరాబాద్ యువతికి ఆన్‌లైన్‌లో పరిచయమై రూ. లక్షలు కొల్లగొట్టాడు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన యువతికి లండన్‌లో డాక్టర్ అజయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. చదువు పూర్తి చేసుకుని 4 నెలల క్రితం యువతి హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. తర్వాత అజయ్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను వెతికి రోజూ చాటింగ్ చేసేది. అవతలి వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తే అని నమ్మి తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను అతనికి ఇచ్చింది. ప్రతిరోజూ వారు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసేవారు.ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా బహుమతి పంపిస్తున్నానంటూ ఆశలు రేపాడు. ఒక వేళ కస్టమ్స్ వారు అడిగితే డబ్బులివ్వాలని సూచించాడు. తర్వాత ‘ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయంలో బహుమతి ఉందని, అందులో రూ.5 లక్షల పౌండ్లు ఉన్నాయని ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వీటిని పంపాలంటే రూ. 2.5 లక్షలు చెల్లించాలని సూచించాడు. ఇది నిజమే అని నమ్మిన యువతి ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు పంపింది.తర్వాత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు ఇవ్వాలంటూ మరోసారి రూ.2.5 లక్షలు గుంజారు. ఇలా పది రోజుల్లో పలుదఫాలుగా రూ. 15 లక్షలు కొల్లగొట్టారు. తీరా బహుమతి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఆ ఫోన్ నంబర్లకు తిరిగి కాల్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ శనివారం సైబర్ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు.