Highlights
- రామాయణం సాంప్రదాయాలను బోధిస్తుంది
- ఒంటిమిట్టలో 30న సీతారాముల కల్యాణం
ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ధర్మాన్ని వీడలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడని, సుపరిపాలనకు ఆద్యుడని చెప్పారు. ఆదివారం ఆయన రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..శ్రీరాముని పరిపాలన దక్షత నేటి పాలకులకు స్ఫూర్తి కావాలన్నారు. రాముడి కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచిందని, నెలకు మూడు వర్షాలు కురిశాయని ఇతిహాస కావ్యాలు చెబుతున్నాయని చెప్పారు. సమస్యల నుంచి పారిపోకుండా, సంక్షోభాలను ఎదుర్కొని, విజయాలు ఎలా సాధించవచ్చో రాముడు నిరూపించాడని చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ సంప్రదాయాలను రామాయణం బోధిస్తుందని తెలిపారు. శ్రీరామనవమి వేడుకలను ఈ నెల 30వ తేదీన కడప జిల్లా ఒంటిమిట్టలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చంద్రబాబు తెలిపారు.