మళ్లీ రెచ్చిపోతున్న కాల్ నాగులు
విజయవాడ, డిసెంబర్ 30,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ రగడ మళ్ళీ సృష్టించింది. మొన్న ఒక బాధితుడు ఏకంగా పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్యా యత్నం చేయడంతో కలకలం రేగగా ఇప్పుడు ఒక జంట ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళగిరి మండలం కాజ పుల్లయ్య నగర్ లో దంపతులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిన్న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలిశెట్టి పూర్ణ చందర్రావు పోలిశెట్టి లక్ష్మి అనే దంపతులు కాజా పుల్లయ్య నగర్లో నివాసం ఉంటున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి కొంతమంది వద్ద అప్పు చేశారు అయితే అప్పుల వాళ్ళు వేధింపులు తట్టుకోలేక వీరిద్దరు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతుల వ్రాసిన సూసైడ్ నోట్, ఆధారంగా వడ్డీ వ్యాపారుల వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు, నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే సూసైడ్ నోట్ ను పోలీసులు రహస్యంగా ఉంచారు.కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి ఉండవల్లి సెంటర్ సమీపంలోని బకింగ్ హామ్ కాలువలో దూకి ప్రేమ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తూపాకుల మహేష్ అంటూ సెల్ఫీ విడియోలో చెప్పాడు ప్రేమ్. ఆరు లక్షలకు 16 లక్షలు కట్టానంటూ సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. విజయవాడ పటమట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల ముందే.. కాల్ మనీ గ్యాంగ్ కులం పేరుతో దూషించినా పట్టించుకోలేదన్నాడు. బకింగ్ హామ్ కాలువ దగ్గరకు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బుల కోసం తమను వేధించారని.. కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తూపాకుల మహేష్ ను కఠినంగా శిక్షించాలని కోరారు.