మరోభూ వివాదంలో కాటసాని
హైద్రాబాద్, డిసెంబర్ 30,
హైదరాబాద్ శివారులోని రూ.100 కోట్ల విలువచేసే భూమి వివాదంగా మారింది. ఈ భూమి తనదంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బోర్డు పెట్టిస్తే, ఇందులో స్థలాలు తమవంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూమి వివాదాస్పదమైంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలోని తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలోని ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిపై ఇరు వర్గాలూ తమదంటే తమదని వాదిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబరు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లో ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలంలో ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు.తుఫ్రాన్‌పేట గ్రామం పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి 2000 సంవత్సరంలో తన పేరున జీపీఏ చేసుకున్నాడు. అనంతరం ఈ ప్లాట్లను విక్రయించగా, హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వీటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో ఎకరం రూ. 2 కోట్లకు పైగా పలకడంతో మొత్తం దీని విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అయితే, ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డును ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించి, అందులోకి ఎవరూ వెళ్లకుండా కందకాలు తవ్వారు. దీంతో వెంచర్‌లో స్థలాలు కొనుగోలుచేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు.ఇరవై ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా కలెక్టర్, డీసీపీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. తాజాగా ఆదివారం నాడు బాధితులంతా వెంచర్ వద్దకు వచ్చి సమావేశం నిర్వహించారు. స్థలం వద్ద ఎమ్మెల్యే పేరిటి ఏర్పాటుచేసి బోర్డుల్లోని నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడినట్టు వెల్లడించారు. ఇందులో తన భూమి కూడా ఉందని, మాట్లాడుకుందామని ఎమ్మెల్యే చెబుతున్నారని బాధితులు పేర్కొన్నారు.మరోవైపు, ఈ అంశంపై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబరు 89లోని పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానని అన్నారు. నెల రోజులుగా కొంత మంది తనకు ఫోన్ చేసి ఇందులో తమకు ఫ్లాట్లు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. అయితే, మా కంటే ముందే ఈ భూమిని వారికి అమ్మి ఉంటే వాళ్లకే ఇచ్చేస్తామని, కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉందన్నారు. అప్పట్లో వెంచర్ వేసిన చంద్రమౌళీశ్వర్ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయని, గతంలో సీబీసీఐడీ విచారణలో ఆయన జైలుకు వెళ్లారని అన్నారు. అంతేకాదు, కొంత మంది కావాలనే దీనిపై వివాదం చేస్తున్నారని, తమ వద్ద భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు