దొరికిన చెడ్డీ గ్యాంగ్
హైద్రాబాద్, డిసెంబర్ 30,
కొంతకాలంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చెడ్డీ గ్యాంగ్‌లోని ఆరుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి భారీమొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.కొంతకాలంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని రాత్రివేళ్లలో ఈ గ్యాంగ్ రెచ్చిపోతోంది. రెండు నెలల క్రితం కుంట్లూరు నగర పంచాయతీలో ఒకేరాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోయారు. హయత్‌నగర్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి వ్యక్తిని నిర్బంధించి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. చెడ్డీగ్యాంగ్ కోసం పోలీసులు ఎంతలా ప్రయత్నించినా పట్టుకోలేకపోవడంతో అనేక విమర్శలు వచ్చాయి.దీంతో బీహార్‌కు చెందిన చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు వీరి కోసం గాలించి చివరికి ఆరుగురిని పట్టుకోగలిగారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోందని, చోరీలకు సంబంధించి సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగి వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. వీరంతా నగర శివారులోని అటవీ ప్రాంతాల్లో మకాం వేసి, రాత్రివేళల్లో కాలనీల్లోకి వచ్చి చోరీలకు పాల్పడుతుంటారని వెల్లడించారు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుంటారని తెలిపారు.ఁ