భారీగా డ్రగ్స్ .. డీలర్ అరెస్ట్
హైద్రాబాద్, డిసెంబర్ 30,
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు. నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబైకి చెందిన షాబాజ్ అనే వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 6 గ్రాముల కొకైన్, 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేసే షాబాజ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో జరిగే న్యూ ఇయర్ వేడుకల కోసం భారీగా డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్‌లో షాబాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లిలో నివాసముండే షాబాజ్ ముంబయి నుంచి డ్రగ్స్ తెప్పించి పార్టీలకు సరఫరా చేస్తున్న పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. అతడి ద్వారా ఎవరైనా డ్రగ్స్ తెప్పించుకున్నారా? అన్న కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఒకప్పుడు మద్యం, ఆటపాటలకే పరిమితమైన న్యూ ఇయర్ పార్టీల్లో ఇప్పుడు డ్రగ్స్ ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. గతంలో విదేశీయులే హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఇప్పుడు స్థానికులే డ్రగ్స్ వ్యాపారుల అవతారం ఎత్తి సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడి కొంతమంది.. అధిక సంపాదన కోసం మరికొంతమంది.. తెలిసీ తెలియక ఇంకొందరు ఈ దందాలో చిక్కుకుంటున్నారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి హైదరాబాద్‌లో గతేడాది 55 కేసులు నమోదు కాగా.. 2019లో 88 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 196 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.