YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

.పెరట్లోనే ఆరోగ్యం.., ఆదాయం

.పెరట్లోనే ఆరోగ్యం.., ఆదాయం

.పెరట్లోనే ఆరోగ్యం.., ఆదాయం
మచిలీపట్నం, డిసెంబర్ 30 
ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. సాగును విస్తృతం చేసే కార్యక్రమంలో పెరటి తోటల పెంపకంలో మహిళలను భాగస్వాములను చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి సాగులో పంటలు పండించేందుకు మహిళా రైతులకు, ఇళ్ల వద్ద పెరటి తోటల పెంపకంలో గృహిణులకు అవగాహన కల్పిస్తున్నారు. పెరటి తోటల సాగును ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రసాయనాల్లేని కూరగాయలను ఇంట్లో అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు బయట విక్రయించడం ద్వారా పలువురు ఆదాయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గతంతో పోల్చితే ప్రకృతి సాగు విస్తృతమయింది.మార్కెట్‌లో ధరలు అధికంగా ఉంటున్నందున, ఇంటి వద్ద ఉన్న కొద్దిపాటి స్థలంలో సొంతంగా పండించుకుంటే ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు రసాయనాల్లేని కూరగాయల ద్వారా ఆరోగ్యం సమకూరుతుందనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలో 207 గ్రామాలను ఎంపిక చేసి పెరటితోటలను సాగు చేయిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 11,652 గ్రామ సమైఖ్య సంఘాలను తోటల పెంపకంలో భాగస్వాములను చేశారు. ఈ సంఘాల్లోని 18,855 మంది మహిళలు తోటలు వేశారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంలో ఒక సెంటు నుంచి 3 సెంట్ల విస్తీర్ణంలో వివిధ రకాల ఆకు, కూరగాయలు సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మహిళలకు స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. నాట్లు వేయడం నుంచి కలుపుతీత, కోత తదితర పనుల్లో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రకృతి సాగు చేస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలితాలు సాధిస్తున్న గ్రామ సమైఖ్య సంఘాల్లోని మహిళలను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తున్నారు. ఇటువంటి వారికి సహాయ సహకారాలు అందించేందుకు సీఆర్పీలు, ఐసీఆర్పీలను ప్రత్యేకంగా నియమించారు. పది మంది సభ్యులు ఉన్న సంఘంలో నలుగురు మహిళలకు ఒకొక్కరికీ రూ.50 వేలు చొప్పున రూ.2 లక్షలు అందజేస్తున్నారు. 11 మంది సభ్యులు ఉన్న సంఘంలో ఆరుగురు మహిళలకు రూ.3 లక్షల రుణం ఇస్తున్నారు. సభ్యులు వారి వెసులుబాటును బట్టి ఆ రుణాన్ని అందరూ పంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. మహిళలంతా అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పెరటితోటల సాగులో యాజమాన్య పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించేందుకు సిబ్బందిని నియమించారు. ప్రకృతి విధానంలో సాగు చేసే రైతులకు జీవామృతంతో విత్తనశుద్ధి చేయడం, అవసరం మేరకు విత్తనాలు చల్లడం, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. భవనాలపై మిద్దె తోటల పెంపకంపై కూడా శాస్త్రవేత్తలతో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఘంటసాల, గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రాల్లో మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సర్టిఫికెట్‌ కోర్సును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ తోటల్ని ఎలా పెంచాలి, ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై శాస్త్రవేత్తలు శిక్షణ అందిస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసినవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. కోర్సు పూర్తయిన తరువాత ధ్రువపత్రాలు అందజేస్తారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడంతోపాటు స్వయం ఉపాధితో జీవితంలో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన మహిళలు ఎంతో మంది పెరటితోటల ద్వారా ఆదాయం పొందుతున్నారు.

Related Posts