YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నిషేధం అయినా ఆదాయం..

నిషేధం అయినా ఆదాయం..

నిషేధం అయినా ఆదాయం..
శ్రీకాకుళం, డిసెంబర్ 30 
సంపూర్ణ మద్య నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ క్రమంలో తీసుకుంటున్న కొన్ని చర్యలు మద్యం అమ్మకాలు తగ్గేందుకు కారణమవుతున్నాయి. అదే సమయంలో ఆదాయం మాత్రం తగ్గటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు ఆఖరు వరకు రూ.643.77 కోట్ల అమ్మకాలు జిల్లాలో జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అదే ఎనిమిది నెలలకు అమ్మకాల మొత్తం రూ.713.65 కోట్లకు చేరింది. మొత్తం రూ.69.88 కోట్ల పెరుగుదల నమోదయింది. చివరి రెండు మాసాల్లో ధరలు పెంచినా ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్టోబరు, నవంబరు మాసాల్లో నిరుడు రూ.154.92 కోట్ల మేర ఆదాయం వస్తే.. ఈ ఏడాది ఆ రెండు నెలల్లోనూ రూ.189.79 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఎనిమిది మాసాల్లో పెరిగిన ఆదాయం రూ.69.88 కోట్లతో పోలిస్తే.. అక్టోబరు, నవంబరు నెలల్లోని పెరుగుదలే రూ.34.87 కోట్లు కావడం గమనార్హం. గత అక్టోబరులో ఏకంగా 1.64 లక్షల మద్యం కేసుల అమ్మకాలు సాగితే.. ఈ అక్టోబరులో కేవలం 1.35 లక్షల కేసులకే పరిమితం అయింది. నవంబరులో నిరుడు 1.44లక్షల కేసులు అమ్మితే.. ఈ నవంబరులో అది కాస్తా 1.28 లక్షల కేసులకు తగ్గిపోయింది. బీర్ల అమ్మకాల్లోనూ ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. నిరుడు అక్టోబరులో 97 వేల పైచిలుకు బీర్ల అమ్మకాలు జరిగితే.. ఈ అక్టోబరులో అదికాస్తా 55 వేలకు పరిమితం అయింది. అదే గత నవంబరులో 73 వేలకు పైగా బీర్లు అమ్ముడైతే.. ఈ నవంబరులో 36 వేలకే పరిమితం కావడం విశేషం. పెంచిన ధరలతో మందుబాబుల జేబులు మాత్రం ఖాళీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 239 మద్యం దుకాణాలు ఉండేవి. వీటికి తోడు 46 బార్లు, రెండు క్లబ్బులకు ఎచ్చెర్లలోని ఐఎంఎల్‌ డిపో నుంచి టోకున మద్యం అమ్మకాలు సాగుతాయి. ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన దుకాణాలకు మాత్రమే అక్కడ కేసుల్లో మద్యం విక్రయిస్తుంటారు.కొందరు తమ అనుమతులు పునరుద్ధరించుకోకపోవటం...ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 18 శాతం దుకాణాలు మూత పడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 196 దుకాణాలు మిగిలాయి. ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తున్నా.. మద్యం కేసుల అమ్మకాలు తగ్గడం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమేనని ఎక్సైజ్ శాఖ వర్గాలంటున్నాయి. తగ్గుదల ఇదే రీతిలో కొనసాగితే ప్రభుత్వ నిర్ణయం ఫలితాల దిశగా అడుగులేస్తున్నట్లేనని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే మార్చి వరకు లెక్కలను పరిగణించి ఒక అంచనాకు రావొచ్చనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Related Posts