YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భద్రాద్రిలో రాములోరి వైభోగం 

భద్రాద్రిలో రాములోరి వైభోగం 

భద్రాచలంలో రామదాసు గారు ప్రతి సంవత్సరం ఆచరిస్తూ వచ్చిన శ్రీ సీతారామ కల్యాణాన్ని ఈ నాటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో మనమంతా తిలకించి తరిస్తూ ఉంటాం. అక్కడ వాడిన తలంబ్రాలు ఎలాగో ఓలాగ సంపాదించి ఇంట్లో పెట్టుకుని వివాహం సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు ఎందరో ఉపయోగిస్తూ ఉంటారు.

తెలుగు వారు శుభలేఖలో *‘జానక్యాః కమలామలాంజలి పుటేయా …’ అనే శ్లోకం ముందుగా రాసి శ్రీ సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని స్మరిస్తూ వారి ఆశీర్వాదాన్ని పొంది మిగతా వివరాలను వ్రాసుకుంటారు.

సూర్యుడు, తేజస్సు ఎలా విడిపోలేవో, మేమిరువురం అంత గొప్పగా కలసి ఉంటామని సీతమ్మ చెబుతుంది. పందిళ్లలో రామకథ చెప్పటం, వినటం వలన నానాటికీ ధర్మబద్ధమైన జీవితాన్ని మరచిపోయిన వారు, సదాచారాన్ని విస్మరించిన వారు ఒక్కసారి జీవన విధానాన్ని పునశ్చరణ చేసుకుని తప్పులను దిద్దుకునే అవకాశం ఉండగలదనే ఒక మంచి ఆలోచనతో పెద్దలు ఊరూరా రామాలయం, ఏటా కళ్యాణం అనేది మన ముందుంచినట్లు కనిపిస్తోంది.*

రామాలయంలో మనకున్న అద్భుతమైన వాగ్గేయకారులైనరామదాసు, త్యాగయ్య కృతులు ప్రతిరోజూ గానం చేసి సంగీత సాహిత్యాలతో సేవ చేస్తూ ప్రజలలోని కళాత్మకతను, భక్తి భావాలను పెంపొందించటం కూడా ఇందులో ఒక భాగం. వడపప్పు, పానకం శ్రీరామనవమికి కచ్చితంగా మనం ఆస్వాదిస్తాం. అందుచేత ఈ దినుసుల వాడుకను మనం ప్రత్యేకంగా చూస్తాం. శ్రీరాముడు నిత్య కల్యాణ స్వరూపుడు. త్యాగయ్య "నిత్యోత్సవంబు గల నీకు నిజదాసుడని తథ్యంబు పలుకు శ్రీ త్యాగరాజార్చిత అంటాడు. ఊళ్లోని యువత ఇందు మూలంగా ఒక సంఘటిత శక్తిగా ముందుకు దూకి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకుగాను తాటాకు పందిళ్ళు వేసుకుని, దానధర్మాలకు, అన్నదానాలకు తగు సదుపాయాలను ఏర్పాటు చేసుకుని శ్రీ సీతారాముల కల్యాణ్యాన్ని చక్కగా జరిపించినప్పుడు సమాజంలోని సృజనాత్మకత, చైతన్యం ఒక ఉత్సవాన్ని జరుపుకునే సందర్భాన్ని మనం చూస్తున్నాం.

*పండుగలు, పబ్బాలు కేవలం వేడుక, వ్యాపారం కోసం పరిమితం కానవసరం లేదు.దర్శనం కోసం తొక్కిసలాట చేసేసి స్వామి ముందర నమస్కారం చేస్తూ నిలబడటం, ఆ స్వామి ఆచరించి చూపించిన ఆదర్శవంతమైన మార్గాన్ని విస్మరించటం దేనికి నిదర్శనం? కష్టపడి ఒక ధర్మమార్గాన్ని ఆచరించాలంటే ఇబ్బంది. ఒక్కరోజు ఉత్సవంలో పాల్గొని నేనూ భక్తుడనే అని చెప్పుకోవటం సులభమైపోయింది. స్నేహం, సౌశీల్యం వంటి ఉదాత్తమైన అంశాలను ఆచరణలోకి తెచ్చుకుని గ్రామాలు, పట్టణాలు దురాచారాలకు స్వస్తి పలికిన రోజున ఉత్సవాలకు ఒక సరైన అర్థం ముందుకు వస్తుంది.
                                                                                    -- కూనపులి సుబ్రమణ్య శర్మ, సిద్ధాంతి, న్యూఢిల్లీ 
 

Related Posts