YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రాజెక్టు గండి పడి నీరువృధా అయినా  సాగునీరు అందిస్తాం - మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రాజెక్టు గండి పడి నీరువృధా అయినా  సాగునీరు అందిస్తాం - మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రాజెక్టు గండి పడి నీరువృధా అయినా  సాగునీరు అందిస్తాం
- మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి డిసెంబర్ 31
సరళ సాగర్ ప్రాజెక్టుకు గండి పడి నీరు వృధా అయినప్పటికీ ప్రాజెక్టు కింద రబీలో నిర్దేశించిన నాలుగు వేల ఎకరాలకు సాగునీటిని అందించి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు     మంగళవారం ఉదయం వనపర్తి జిల్లా మదనాపురం మండలం లో ఆసియా ఖండంలోని మొదటిదైన సైఫన్ సిస్టమ్ తో  నడిచే సరళ సాగర్ ప్రాజెక్టుకు గండి పడిందని తెలిసిన వెంటనే మంత్రి ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గండి ద్వారా బయటికి వచ్చిన నీటిని అంతటినీ రామన్ పాడు రిజర్వాయర్కు వెళ్లేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ రామన్ పాడు రిజర్వాయర్ లో కూడా సామర్థ్యానికి మించి మీరు వచ్చినట్లయితే దిగువకు వదిలి వేయాలని సూచించారు.  ఈ సందర్భంగా మంత్రి రైతులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుకు గండి పడటం దురదృష్టకరమని అన్నారు. అయితే గండి కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట  నష్టం వంటివి జరగలేదని, సరళ సాగర్ ప్రాజెక్టులోని నీరు మొత్తం దిగువన ఉన్న రామన్ పాడు రిజర్వాయర్లోకి వచ్చి చేరిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయిలో సరళ సాగర్ ప్రాజెక్ట్ ను నీటితో నింపడం జరిగిందని, ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు సమృద్ధిగా పంటలు పండించు కున్నారని, రబీలో కూడా పంట వేసేందుకు వరి నారుమళ్లు సిద్ధం చేశారని, అయితే దురదృష్టవశాత్తు ప్రాజెక్టుకు గండి పడిందని తెలిపారు. అయినప్పటికీ రైతులు దిగులు చెందాల్సిన పని లేదని, ఎలాంటి ఆందోళన వద్దని, సరళ సాగర్ ప్రాజెక్టు లోకి వచ్చే పాయకు సమాంతరంగా తక్షణమే కాలువను తవ్వి సరళ సాగర్ ప్రాజెక్టు తూము లోకి నీటిని వదలటం జరుగుతుందని, తద్వారా సరళ సాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతులు ఎప్పటిలాగే రబీలో కూడా పంటలు సాగు చేసుకోవచ్చని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు గండి పడ్డ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందం హైదరాబాద్ నుండి బయలుదేరిందని, సమాంతర కాలువ నిర్మాణానికి వెంటనే సర్వే ప్రారంభించి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని పెంచటం, ఆనకట్టను పటిష్టం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం ప్రాజెక్టుకు గండి పడినందున మరమ్మత్తుల లో భాగంగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచే పనులను కూడా చేపట్టే విషయం ఆలోచిస్తామని, లేదా అలాంటి పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే గండి పూడ్చి మరమ్మతులు చేపడతామని, సాంకేతిక నిపుణుల సలహా మేరకు పనులు చేపడతామని వెల్లడించారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపి పంటలకు సాగునీరు అందించడం జరుగుతుందని, సరళ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా కూడా 4300 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, అంతేకాక ప్రాజెక్టులో 10 లక్షల చేపపిల్లలను వదలటం జరిగిందని  ఇలాంటి తరుణంలో ప్రాజెక్టుకు గండి పడటం బాధ కలిగించిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రబీలో సరళ సాగర్ ప్రాజెక్ట్ కింది సరళ సాగర్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందని తెలిపారు.    జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వ రావు, జిల్లా ప్రత్యేక అధికారి, ఐఏఎస్ అధికారి సంతోష్, జాయింట్ కలెక్టర్ డి. వేణు గోపాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Related Posts