YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంటిమిట్టలో ఘనంగా ధ్వజారోహణం 

Highlights

  • వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • తలంబ్రాల తయారీని ప్రారంభించిన 
  • కవి సమ్మేళనం 
ఒంటిమిట్టలో ఘనంగా ధ్వజారోహణం 

తిరుపతి తిరుమల దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.03 గంటలకు పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్‌ శ్రీరాజేష్‌కుమార్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమానికి హాజరైన  రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి,  ఆదినారాయణరెడ్డిలు శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని  ప్రారంభించారు. అనంతరం బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారుచేశారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి ఆధ్వర్యంలో 380 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. 

  
 శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు  రాష్ట్ర మంత్రులు తెలిపారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయన్నారు. మార్చి 30న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేసేందుకు టిటిడి కృషి చేస్తోందన్నారు. ధర్మప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి టిటిడి సహకారం అందిస్తోందని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకారులకు అర్చక శిక్షణ ఇచ్చి ఆయా ఆలయాల్లో అర్చకులుగా నియమిస్తుండడం ముదావహమన్నారు.

''శ్రీరామణీయకం'' ప్ర్రత్యేక సంచిక ఆవిష్కరణ : 

ఒంటిమిట్టలోని పోతన సాహిత్య పీఠం ఆధ్వర్యంలో విద్వాన్‌ కట్టా నరసింహులు రచించిన ''శ్రీరామణీయకం'' ప్రత్యేక సంచికను శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా  రాష్ట్ర మంత్రులు  ఆవిష్కరించారు. ఇందులో ఒంటిమిట్టను ఆశ్రయించిన  బమ్మెర పోతన, అయ్యలరాజు తిప్పయ్య రామభద్రకవి, వావిలికొలను సుబ్బారావు రచనలకు సంబంధించిన 32 వ్యాసాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు 32 మెట్లు ఉన్నాయని, రంగమంటపంలో 32 స్తంభాలున్నాయని,  స్వామివారికి 32 రకాల అర్చనలు జరుగుతాయని, ఈ కారణంగానే 32 వ్యాసాలతో ప్రత్యేక సంచికను రూపొందించానని సంపాదకులు విద్వాన్‌ కట్టా నరసింహులు తెలిపారు.బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌ శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి  స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది. ఈ సందర్భంగా పోతన వ్యక్తిత్వం, భాగవత విశిష్టత, పోతన భక్తిత్వం, జనప్రియ రామాయణం, రాయామణ కల్పవృక్షం తదితర అంశాలపై ప్రముఖ కవులు సమ్మేళనం నిర్వహిస్తారు.కాగా, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు శేషవాహనంపై స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు  సిఎం.రమేష్‌, ఎంఎల్‌సి రామసుబ్బారెడ్డి, రాజంపేట ఆర్‌డివో  వీరబ్రహ్మం, టిటిడి డెప్యూటీ ఈవోలు  విజయసారథి, శ్రీ దేవేంద్రబాబు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి  ఎ.రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి డా. రమణప్రసాద్‌, గార్డెన్‌ సూపరింటెండెంట్‌  శ్రీనివాసులు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
 

Related Posts