YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రామరాజ్యంపై విశ్వాసం

Highlights

  • మహాత్మా గాంధీ ఆకాంక్ష 
రామరాజ్యంపై విశ్వాసం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

శివధనుస్సును విరచి సీతను వివాహం చేసుకున్నాడు శ్రీరాముడు. భార్య సహా అయోధ్యకు బయల్దేరాడు. ఈ సంగతి తెలుసుకున్నాడు పరశురాముడు. తన దైవం శివుని ధనుస్సును శ్రీరాముడు విరవడాన్ని తట్టుకోలేకపోయాడు. అవమానంగా భావించాడు. శ్రీరాముణ్ణి ఎదుర్కొన్నాడు. తన కుమారుణ్ణి కాపాడమని దశరథుడు ఎంతగా కాళ్ళా వేళ్ళాబడినా కనికరించలేదు పరశురాముడు. కోపంతో కళ్ళెర్రజేసి అన్నాడిలా.‘‘చూడబోతే బాలుడవు, నువ్వా శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచింది! ఏదీ నా ధనుస్సును ఎక్కుపెట్టు చూద్దాం. నీ బలం, ధైర్యం తెలిసిపోతాయి.’’తన ధనుస్సును శ్రీరాముడికి అందజేశాడు పరశురాముడు. అతని ధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. దానితో పాటు పరశురాముని తేజస్సును కూడా హరించాడతను. అప్పుడు శ్రీరాముడు, సాక్షాత్తూ విష్ణుమూర్తిని గ్రహించాడు పరశురాముడు. నమస్కరించాడతనికి. శాంతచిత్తుడై మహేంద్రపర్వతం మీదికి తరలిపోయాడు.క్షత్రియులకు సింహస్వప్నం, బ్రాహ్మణపక్షపాతి పరశురాముడు చిరంజీవి. రానున్న మన్వంతరంలో అతను సప్తర్షులలో ఒకడు కాగలడు.

గాధిరాజు కుమారుడయిన విశ్వామిత్రుడు, అనేక సంవత్సరాలపాటు రాజ్యపాలన చేశాడు. క్షత్రియుడు అయినప్పటికీ తపోబలంతో బ్రాహ్మణ్యం సాధించాడు. మహర్షి అయినాడు. విశ్వామిత్రుని తపోబలం చాలా గొప్పది. కాని, రాజసం వల్ల అతని తపోబలం చాలా వ్యర్థమయింది. విశ్వామిత్రుని గురించి భాగవతంలో చాలా సంక్షిప్తంగా ఉంది. అతను రామలక్ష్మణులకు గురువు. వారికి ధనుర్విద్యను నేర్పిన మహానుభావుడు. అంతేకాదు, గాయత్రీమంత్రానికి విశ్వామిత్రుడు ఋషి. విశ్వామిత్రునికీ, వసిష్ఠునికీ బద్ధ వైరం. విశ్వామిత్రుని రాజర్షిగానే అంగీకరిస్తాడు వసిష్ఠుడు. కాదు, తాను బ్రహ్మర్షినంటాడు విశ్వామిత్రుడు. ఆఖరికి ఆ స్థానాన్ని అందుకున్నాడతను. విశ్వామిత్రుని ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు. 

అతనికి నూటక్క మంది కుమారులు. వారిలో మధ్యవాడు మధుశ్చంద్రుడు. ఫలితంగా అంతా మధుశ్చంద్రులయినారు. హరిశ్చంద్రుని యజ్ఞపశువయిన శునస్సేపుణ్ణి తన ఆశ్రమానికి తీసుకుని వ చ్చాడు విశ్వామిత్రుడు. పుత్రులతో సమానంగా చూశాడతన్ని. తన పుత్రులను కూడా అతన్ని అన్నగా చూడమని చెప్పాడు. పెద్దవారయిన యాభైమంది మధుశ్చంద్రులూ అందుకు అంగీకరించలేదు. కోపం వచ్చింది విశ్వామిత్రునికి. వారిని ‘మ్లేచ్ఛులు’కండి అని శపించాడు. చిన్నవారయిన యాభైమందీ శునస్సేపుణ్ణి అన్నగా భావించి అభిమానించారు. అందుకు సంతోషించాడు విశ్వామిత్రుడు. వారికి సంతానవృద్ధి కలిగేటట్టుగా దీవించాడు.జన్మతః భార్గవుడయినప్పటికీ తనని పుత్రునిగా విశ్వామిత్రుడు స్వీకరించడంతో శునస్సేపుడు కౌశికుడు అయినాడు. కౌశికుడికి అష్టకుడు, హరీతుడు, జయంతుడు, సుమదాముడు, మొదలయిన వారు జన్మించారు.
 

Related Posts