YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 నో రికవరీ..

 నో రికవరీ..

 నో రికవరీ.. (నెల్లూరు)
నెల్లూరు, జనవరి 01: చోరీ కేసుల్లో అపహరణకు గురైన సొత్తు రికవరీలో పురోగతి కనిపించడం లేదు. నిందితులు తెలిసినా వారిని పోలీసులు పట్టుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతుందో తెలియని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చోరీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రికవరీలు మాత్రం ఆ మేరకు పెరగడం లేదు. చిన్న కేసుల్లో దొంగలను పట్టుకుని అరెస్టులు చేస్తున్నారే తప్ప రూ.కోట్లు దోచుకున్న నిందితులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. కొన్ని కేసులు ఏళ్లు గడుస్తున్నా పురోగతి లేదు. ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. బాధితులు మాత్రం నిత్యం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీఎస్‌ వ్యవస్థ చైన్‌ దొంగలు, గుట్కా ప్యాకెట్లకే పరిమితమవుతోంది. జిల్లాలో 22 సర్కిళ్ల పరిధిలో 64 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌లో ఒకరు, ఇద్దరేసి ఎస్సైలు ఉంటారు. జనాభాను బట్టి స్టేషన్లలో ఎస్సైలు ఉంటారు. నగరంలో అయిదు పోలీసు స్టేషన్లతో పాటు బాలాజీనగర్‌ స్టేషన్‌ ఉంది. వీటితో పాటు క్రైం బ్రాంచి వ్యవస్థ కూడా ఉంది. కొన్ని కేసులను సీసీఎస్‌కు అప్పగిస్తారు. వీరి వద్ద పాత నిందితుల వివరాలు, వేలి ముద్రలు, ఇతర వివరాలు అందుబాటులో ఉండటంతో నేరాలను అదుపు చేయడం, రికవరీలు చేయడంలో సీసీఎస్‌ కూడా ఒక భాగమే. జిల్లా వ్యాప్తంగా నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి. పట్టపగలు, రాత్రుళ్లు అనే తేడాలు లేకుండా తాళం వేసిన ఇంటికి కన్నాలు వేసేస్తున్నారు. కేవలం ఒకట్రెండు సవర్ల కోసం కూడా హత్యలు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల పెరిగాయి. మారుతున్న కాలానుగుణంగా నిందితుల్లోనూ మార్పులు వస్తున్నాయి. వీటిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. చోరీలు పాత దొంగలు చేస్తున్నారా? పాత నేరస్థులా?ముఠా సభ్యులు ఉన్నారా అని గుర్తించడం లేదు. దీంతో చోరీల సంఖ్య నానాటికి పెరుగుతోంది. స్టేషన్లలో కేసులు పరిష్కరించాల్సిన ఎస్సైలు పంచాయితీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సివిల్‌ కేసులు, ఆస్తి తగాదాలు, తదితర కేసులను స్టేషన్లలో పరిష్కరించి లాభం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం పోలీసు స్టేషన్లలో సివిల్‌ కేసులు పరిష్కరించకూడదు. గ్రామాల్లో వీటికే ప్రాధాన్యమిస్తున్నారు. మండలాలు, పట్టణ కేంద్రాల్లోని పోలీసు స్టేషన్లలో సాయంత్రం అయితే చాలు బాధితులతో కిటకిటలాడుతుంటోంది. స్టేషన్‌కెళితే రూ.10వేలు ముట్టజెప్పాల్సిందే. కేసుల్లో ప్రమేయం లేని వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడుతుంటారు. చోరీల కేసుల్లో రికవరీ చేయడంలో లేని శ్రద్ధ.. ఇలాంటి కేసులపై పెడుతుంటారు.  జిల్లాలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏడాది చోరీ సొత్తు రూ.కోట్లలో ఉంటుంది. కానీ వాటిని రికవరీలో మాత్రం 50 శాతం వరకు చేయలేకపోతున్నారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడం లేదు. ఒక కేసును దర్యాప్తు చేేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. నిందితుల కోసం వేరే ప్రాంతాలు, రాష్ట్రాలు తిరగాల్సి వస్తోంది. దాంతో పాటు కొన్ని రోజుల పాటు ఇతర ప్రాంతాల్లో బస చేయాల్సి ఉంటుంది. వాటి కోసం అవుతున్న ఖర్చు, ప్రభుత్వం భరిస్తోన్న ఖర్చులకు వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగడం లేదు. చోరీ కేసుల్లో ఎంత మొత్తం పోయిందనేది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు చెబుతుంది వాస్తవంగా ఉండేది వేరేగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చోరీ పరిష్కారమై దొంగ దొరికినా రికవరీ పూర్తిస్థాయిలో బాధితుడికి సొత్తు చేరడానికి సమయం పడుతోంది. గరిష్టంగా బాధితులకు అందుతున్నది 50 శాతం లోపే. దీంతో బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో చోరీ అయిన సొత్తు, సొమ్ముల్ని పెంచేస్తున్నారు.

Related Posts