ముందడుగు పడింది (శ్రీకాకుళం)
శ్రీకాకుళం, జనవరి 01 భావనపాడు నౌకాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వమే ముందుకొచ్చింది. ఈ దిశగా ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ‘అదానీ’ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు చేసిన ఒప్పందాన్ని పక్కన పెట్టి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) ద్వారా రుణ సమీకరణ చేసి ప్రభుత్వమే నౌకాశ్రయాన్ని నిర్మించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్న భావనపాడు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2015, ఆగస్టు 28న 4,178.20 ఎకరాల భూ సేకరణకు ప్రకటన చేశారు. 2013 భూసేకరణ చట్ట పరిధిలో సేకరణకు ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మొత్తం ఐదు వేల ఎకరాలు అవసరమని, ప్రభుత్వ భూమి మినహాయించి మిగిలిన 4,178 ఎకరాల మేర సేకరించాలని నాడు అంచనాకు వచ్చారు. అయితే పలు దఫాలుగా సర్వే జరిపిన అనంతరం 770.12 ఎకరాలు అవసరం లేదని గుర్తించారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలంలోని సూర్యమణిపురం పరిధిలో 155.34 ఎకరాలు, కొమరల్తాడలో 294.77 ఎకరాలు, పొల్లాడలో 320.01 ఎకరాలను మినహాయిస్తూ కలెక్టర్ గతేడాది నవంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన భూమిని భూసేకరణ పరిధిలోకి తీసుకొచ్చి తగిన చర్యలు చేపడుతున్నారు. భావనపాడులో 236.39 ఎకరాలు, మర్రిపాడులో 2,582.81 ఎకరాలు, దేవునల్తాడలో 588.88 ఎకరాలు భూసేకరణ పరిధిలో ఉంచారు. ఇదంతా కలిపి 3,408.08 ఎకరాలు. భావనపాడులో ప్రభుత్వ భూమి 66.88 ఎకరాలు అందుబాటులో ఉండగా, మర్రిపాడులో 317 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దేవునల్తాడలో 258.88 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా ఆర్‌ఆర్ ప్యాకేజీ కోసం వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ, రాజపురం గ్రామాల్లో భూమిని ఇప్పటికే పరిశీలించారు. కొమరల్తాడలో సీఆర్‌జెడ్ పరిధిలోని రెండెకరాల భూమి, రాజపురంలో 40 ఎకరాల భూమి తోపాటు రెవెన్యూ భూమి మరో 40 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదించారు.
2018 డిసెంబర్లో పోర్టు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణపై ఓవైపు సర్వే, మరోవైపు అధికారుల రాకపోకలు, ప్రజాప్రతినిధుల సంప్రదింపులతో మర్రిపాడు, భావనపాడు, దేవునల్తాడ, సెలగపేట తదితర ప్రాంతాల్లో హడావుడి నెలకొంది. భూసేకరణ పరిధిపై రోజుకో ప్రచారంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఏ పరిధిలో భూమిని సేకరిస్తారన్న దానిపై కొంతమేర స్పష్టత వచ్చింది. ప్రభుత్వమే నిర్మాణానికి ముందుకు వస్తుండటంతో ప్యాకేజీ అమలు, గ్రామాల తరలింపు తదితర అంశాలపై నిర్వాసిత ప్రాంతాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో భావనపాడు పోర్టు నిర్మాణంలో గ్రామాన్ని తరలించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి మత్స్యకారులకు భద్రత కల్పిస్తామని నేతలు హామీఇచ్చారు. ప్రస్తుతం సమగ్ర ప్రణాళిక ఇంకా తయారు కాకపోవడం, ప్రభుత్వం ఏ విధమైన నిర్మాణం చేపడుతుందో స్పష్టత లేకపోవడంతో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ స్వస్తి పలికే విధంగా ప్రభుత్వం త్వరితగతిన స్పష్టత ఇవ్వడం మంచిదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అన్నింటికన్నా ముందు స్థానికులతో చర్చలు జరపాలని, పోర్టు నిర్మించేది ఎవరైనా తమకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.