YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వదలని భూ సమస్య

వదలని భూ సమస్య

వదలని భూ సమస్య (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, జనవరి 01 : భూ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించి ఏడాది గడిచినా.. ఇంకా భూముల లెక్కలు తేలడం లేదు. పొంతన లేని అటవీ, రెవెన్యూ రికార్డుల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అటవీ శాఖ తమ భూములకు సంబంధించి సరిహద్దులు గుర్తించడం మొదలుపెట్టింది. కొన్నిచోట్ల అటవీ ప్రాంతం చుట్టూ పెద్ద పెద్ద కందకాలు తవ్వుతుండటం పలు వివాదాలకు దారి తీస్తుంది. అభ్యంతరాలు ఉన్న చోట్ల కందకం పనులు నిలిపివేస్తున్నా.. హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. రికార్డుల ప్రకారం తమ భూమి అని అటవీ శాఖ అంటుంటే.. లేదు ఇదే మా భూమి.. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, పట్టాలు కూడా ఉన్నాయని రైతులు అంటున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో అటవీశాఖ భూములు ఏటా అన్యాక్రాంతం అవుతుండటంతో తమ భూమి సరిహద్దులు గుర్తించే పనిలో ఉన్నారు. ఈ విషయమై గతంలో కుమురంభీం జిల్లాలో పెద్ద గొడవనే జరిగింది. అప్పటి నుంచి రైతులు అభ్యంతరం చెప్పిన చోట భూములు స్వాధీనం చేసుకోకుండా, సరిహద్దు రాళ్లు వేస్తున్నారు. రైతులు, అటవీశాఖ మధ్యన నెలకొన్న ఈ వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపైనే ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భూప్రక్షాళన సమయంలో పంటలు సాగు చేసే రైతుల భూములతో పాటు సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అటవీ భూములను గుర్తించారు. జిల్లాలో 29.08 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అందులో 12.02 లక్షల ఎకరాలు అటవీ శాఖవిగా తేల్చారు. దాని ప్రకారంగా అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్తే, అనేక గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు భూములు సాగు చేసుకోవడం, వాటిలో కొంత మందికి రెవెన్యూ శాఖ పట్టాలు ఇచ్చి ఉండటం, మరి కొంతమంది రైతుల వద్ద అటవీహక్కు పత్రాలు ఉండటంతో అటవీ శాఖ అధికారులు వెనుదిరుగాల్సి వస్తుంది.
 ఆదిలాబాద్‌ జిల్లాలోని 12 మండలాల్లో ఈ సమస్య ఉంది. ఇంద్రవెల్లి, నేరడిగొండ, సిరికొండ తదితర మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. రెవెన్యూ పట్టాలు ఉన్న 15.10 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. గతంలో ఈ భూములకు సంబంధించి రూ. 603 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ఉమ్మడి జిల్లాలో 4.98 లక్షల మంది రైతులు పట్టాలు పొంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా మరికొంత మంది రైతులు పట్టాలు పొంది ఉన్నారు. తాజా లెక్కల మేరకు రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల సంఖ్య 5.10 లక్షల మందికి చేరుకునే అవకాశముంది.

Related Posts