YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 పెన్నాపై వాలిన గద్దలు

 పెన్నాపై వాలిన గద్దలు

 పెన్నాపై వాలిన గద్దలు (అనంతపురం)
అనంతపురం, జనవరి 01 : జిల్లాలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. తరతరాలుగా కొలువైన నదీమతల్లి రాబందుల పన్నాగానికి బలవుతోంది. నీటి ప్రవాహ దిశకు అనుగుణంగా, వరద ఉద్ధృతి తట్టుకునేలా సహజ సిద్ధంగా ఏర్పడిన వనరు.. అక్రమార్కుల ధాటికి విలవిల్లాడుతున్న దయనీయమిది. జిల్లాలో హిందూపురంలో అడుగుపెట్టే పెన్నా నది... రొద్దం, పేరూరు, నూతిమడుగు, పెన్నా అహోబిలం, పామిడి, తాడిపత్రి మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదిపైనే పెన్నార్‌-కుముద్వతి.. పేరూరు, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, మధ్య పెన్నా రిజర్వాయర్‌ ఉన్నాయి. పక్క జిల్లా అయిన కడపలో గండికోట జలాశయం కూడా ఉంది. ఇలా రెండు జిల్లాలకూ పెన్నా నది జీవనాధారంగా ఉండేది. ప్రస్తుతం అక్రమార్కుల ఆక్రమణలకు, ధన దాహానికి బలైపోతోంది. కొంచెం కొంచెంగా నది వెడల్పు తగ్గుతూ వస్తోంది. ఇలాగే వదిలేస్తే కొంత కాలానికి విశాలమైన నది చిన్న కాలువలా మారుతుంది. ఆక్రమణదారుల దూకుడు అడ్డుకట్ట వేయకపోతే... మరింత రెచ్చిపోతారు. హిందూపురం మొదలు ఎక్కడ చూసినా ఆక్రమణలే కనిపిస్తున్నాయి. తమ సొంత భూమి అనేలా ఎకరం, రెండు ఎకరాలలో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొందరు నదిలోనే బోర్లు వేసి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వాటికి విద్యుత్తు శాఖ అధికారులు కనెక్షన్లు మంజూరు చేసి దగ్గరలోనే నియంత్రికలు ఏర్పాటు చేయడం గమనార్హం. పామిడి మండలంలో అయితే ఏకంగా పరిశ్రమలే నిర్వహిస్తున్నారు. తాడిపత్రి మండలంలోని తాడిపత్రి, గంగదేవిపల్లి, పులిపొద్దుటూరు, వెలమకూరు, బోడాయిపల్లి, హుసేనాపురం, వీరాపురంలో 161 ఎకరాల్లో ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. నదులు, వంకలు కబ్జాకు గురైన తరుణంలో.. ఇటీవల వర్షాలకు ఉరవకొండ, యాడికి, తాడిపత్రి సహా వివిధ ప్రాంతాలు నీటమునిగాయి. పంట పొలాల్లో రోజుల తరబడి నీళ్లు నిలిచి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆక్రమణలకు గురవుతున్న వాటిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి అపార నష్టాలు మరిన్ని చవిచూడాల్సిందే. ఆక్రమణలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకునే అధికారం స్థానిక అధికారులకు ఉంది. స్థానికంగా ఒత్తిళ్లతో కొందరు.. ఆక్రమణదారులతో ‘సన్నిహితంగా’ ఉంటూ మరికొందరు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎవరైనా వారి దృష్టికి తీసుకెళ్లినా నామమాత్ర తనిఖీలు.. మొక్కుబడి తాఖీదులతో సరిపెడుతున్నారు. తర్వాత అంతా షరా మామూలుగానే సాగుతోంది. ఇంకొన్నిచోట్ల పలువురు స్థానిక అధికారులు అన్నీ తెలిసినా.. అన్నీ చూసినా.. కాసులకు దాసోహమై వదిలేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

Related Posts