YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గిరి వికాసం

గిరి వికాసం

గిరి వికాసం(మెదక్)
మెదక్, జనవరి 01 : దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా ఇప్పటికీ గిరిజనుల పరిస్థితి దయనీయమే. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ గ్రామాలకు దూరంగా తండాల్లో జీవనం సాగిస్తున్న వారే ఎక్కువ. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న వారు తక్కువమందే. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. నీటి వసతి లేకపోవడంతో వర్షాధార పంటలనే పండిస్తున్నారు. గిరిజన రైతుల భూములకు నీటి వసతి కల్పించడంతో పాటు బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఇందిరా జలప్రభ పథకం నిలిచి పోవడంతో గిరిజనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆ పథకం పేరు మార్చి ‘గిరి వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిధులు సైతం కేటాయించింది.జిల్లా జనాభా 15.27లక్షలు ఉంది. ఇందులో గిరిజన జనాభా 86,410. గిరిజనులు మొగుడంపల్లి మండలంలో అత్యధికంగా 7,918 మంది ఉండగా నాగలిగిద్ద మండలంలో 7,555 మంది ఉన్నారు. మొగుడంపల్లి మండల జనాభాలో 21.73 శాతం, నాగలిగిద్ద మండల జనాభాలో 24.25 శాతం మంది గిరిజనులే కావడం విశేషం. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మనూరు మండలం మినహా మిగతా అన్ని మండలాల్లోనూ గిరిజన జనాభా 10శాతం పైనే ఉండటం గమనార్హం. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ గిరిజన జనాభా ఉంది. ఇందిరా జలప్రభ కింద అప్పట్లో చేపట్టి నిలిచిన పనులను గిరి వికాసం పథకం కింద తిరిగి మంజూరు చేసి పూర్తిచేయనున్నారు. బోర్ల వేయని భూముల్లో బోర్లు వేయించనున్నారు. బోరుకు విద్యుత్తు సరఫరా కల్పించని బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు. గిరి వికాసం పథకం పూర్తిచేసి గిరిజనులకు సంబంధించిన భూములను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నివేదికలు సిద్ధం చేసే పనిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిమగ్నమైంది. మండల స్థాయి అధికారుల కమిటీల ఆధ్వర్యంలో పనులను పరిశీలించనున్నారు. ఇందిర జలప్రభ పథకంతో తమ బతుకులు మారతాయనుకున్న గిరిజనులకు నిరాశే మిగిలింది. పథకంలో అక్రమాలు చోటుచేసుకోవడమే దీనికి కారణం. కొన్ని చోట్ల బోర్లు వేయగా మోటారు బిగించలేదు. మరికొన్నిచోట్ల బోర్లు తవ్వకానికి నోచని పరిస్థితి. అవినీతి కారణంగా పథకం ముందుకు సాగకపోవడంతో ఇందిర జలప్రభ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా ఆ పథకం స్థానంలో వచ్చిన గిరివికాసంతో గిరిజన రైతులకు మేలుచేకూర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాకు రూ.1.48కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 302 ఎకరాలు సాగులోకి రానుంది.

Related Posts