మహిళా భద్రతపై ప్రాధాన్యత
విజయనగరం జనవరి 1 :
ట్వంటీ ట్వంటీ - వుమన్ సేఫ్టీ అన్న నినాదంతో పోలీస్ యంత్రాంగం జిల్లాలో పనిచేయనుందని విజయనగరం ఎస్.పి. రాజకుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకి అనుగుణంగా మహిళల రక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. దిశ చట్టం పట్ల విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కాలేజీల్లో అవగాహనను కల్పించనున్నామన్నారు. వార్షిక నేర నివేదికను మీడియాకి వివరించారు. జిల్లాలో గత ఏడాది కన్నా అధికంగానే కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఎన్నికలు, ఇసుక నిషేదం,బెల్ట్ షాపులు నిషేదం వంటి ప్రభుత్వ విధానాల వలన ఈ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గినా మరణాలు సంఖ్య పెరిగిందని చెప్పారు. ప్రధానంగా ఈ ప్రమాదాలన్నీ కూడా పగటి పూట జరగడం గమనించదగ్గవిషయమని చెప్పారు. అందువలనే ఈ ఏడాది కూడా హెల్మెట్ వినియోగం మీద పోలీస్ ఒత్తిడి ఉండేటట్లు చూడనున్నట్లు తెలిపారు. పోలీసులు విచారణ సమర్ధవంతంగా ఉండడం వలన 61 శాతం కేసుల్లో నింధితులకు శిక్ష ఖరారయ్యిందని అన్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా అత్యధికమని అన్నారు. ప్రధానంగా కొమరాడ మండలంలో చిల్లంగి పేరిట జరిగిన హత్య కేసులో 12 మందికి జీవిత ఖైదీ పడడం జిల్లా చరిత్రలో ఇదే ప్రధమమని అన్నారు. 94 కేసుల్లో ఆ కేసుల ఆధారంగా శిక్షలు పడ్డాయని అన్నారు. విచారణలో కొత్త విధానాలను అనుసరించడం, సాక్షులను రక్షించే బాధ్యతలను చేపట్టడం వంటి వాటి వలనే ఇది సాధ్యమయ్యిందని అన్నారు. గంజాయి మీద ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం వలన కూడా కేసులు పెరిగాయని అన్నారు.