వైకుంఠ దర్శనానికి ఏర్పాట్లు
తిరుమల, జనవరి 2,
జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలు, రూ. 300 దర్శన టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశామని వివరించారు.జనవరి 7న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 5 వేల మంది భక్తులకు గతంలోనే ఆన్‌లైన్‌లో కేటాయించామన్నారు. జనవరి 6న తెల్లవారుజామున 2 నుంచి వైకుంఠ ద్వార దర్శ నం ప్రారంభమవుతుందని తెలిపారు. నారాయణ గిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో జనవరి 5న ఉదయం 11 నుంచి రాత్రి 12 వరకు నామసంకీర్తన యజ్ఞం నిర్వ హిస్తామని వెల్లడించారు. జనవరి నెలలో తిరుమల ఆలయంలో పలు విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 6న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు, 7న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, అలాగే 7 నుంచి 13 వరకు ఆండాళ్ నీరాటోత్సవం, 11న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 14న భోగి, 15న మకర సంక్రాంతి. 16న శ్రీవారి పార్వేట ఉత్సవం, శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 19న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 30న వసంతపంచమి తదితర విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.