కన్నా తో వైరమే కొంపముంచిందా
గుంటూరు, జనవరి 2,
రాయపాటి సాంబశివరావు ఆస్తులపై సీబీఐ దాడులు ఒక సిగ్నల్ గానే చూడాలా? కేంద్ర ప్రభుత్వం మరోసారి టీడీపీ నేతలపై గురి పెట్టిందనుకోవాలా? అంటే అవుననే అనిపిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీబీఐని రాకుండా జీవో తెచ్చారు. తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతి ఇస్తూ మరో జీవో జారీ చేశారు. రాయపాటి సాంబశివరావు నిజానికి బీజేపీలో చేరాలని ప్రయత్నించారు. ప్రధాని నరేంద్ర మోడీని వెళ్లి కూడా రాయపాటి సాంబశివరావు వెళ్లి కలసి వచ్చారు.అయితే రాయపాటి సాంబశివరావు తాను బీజేపీలో చేరతానని మూడు నెలల క్రితమే చెప్పినా ఇంతవరకూ కేంద్ర నాయకత్వం క్లియరెన్స్ ఇవ్వలేదు. దీనికి ప్రధానం కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్న ప్రచారం కూడా ఉంది. కన్నా లక్ష్మీనారాయణకు, రాయపాటి సాంబశివరావుకు సుదీర్ఘకాలం నుంచి రాజకీయ వైరం ఉంది. ఇద్దరూ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ విభేదాలు బయటపడుతుండేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ రాయపాటి, కన్నాల మధ్య పంచాయతీని ఆయనే స్వయంగా తీర్చే వారు.ఇప్పుడు తాజాగా రాయపాటి సాంబశివరావు ఆస్తులపై సీబీఐ దాడులు కన్నా లక్ష్మీనారాయణ పుణ్యమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, బ్యాంకు లోను తీసుకునేటప్పుడు ష్యూరిటీ ఇచ్చిన మాట వాస్తవమేనని రాయపాటి సాంబశివరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీతో ఎలాంటి బ్యాంకు లావాదేవీలు జరగలేదని కూడా వారంటున్నారు. కానీ కక్ష పూరితంగానే టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ దాడులు జరిపారని టీడీపీ నేతలు సయితం ఆరోపిస్తున్నారు.రాయపాటి సాంబశివరావుపై సీబీఐ దాడులతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. రాయపాటితో బీజేపీ మళ్లీ ఏపీలో ఆట మొదలు పెట్టిందా? అన్న సందేహాలు కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాయపాటి సాంబశివరావుపై సీబీఐ దాడులు జరుగుతున్న సమయంలోనే కొందరు టీడీపీ నేతలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ దాడులు రాయపాటితోనే ఆగుతాయా? లేక కొనసాగుతాయా? అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా జరుగుతోంది.