YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

నకిలీ బిల్స్ తో కొల్లగోట్టేశారు

నకిలీ బిల్స్ తో కొల్లగోట్టేశారు

నకిలీ బిల్స్ తో కొల్లగోట్టేశారు
హైద్రాబాద్, జనవరి 1,
ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో కొత్త నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. ఇన్సూరెన్స్‌‌‌‌ మెడికల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌(ఐఎంఎస్‌‌‌‌) మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, ఓమ్నీ మెడీ ఎండీ శ్రీహరిబాబు షెల్ కంపెనీల పేరిట భారీగా నిధులు దారి మళ్లించినట్టు ఆధారాలు సేకరించింది. 2017-–18 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎస్ కు ప్రభుత్వం కేటాయించిన రూ.110 కోట్ల నిధులను కొల్లగొట్టినట్టు భావిస్తోంది. నకిలీ బిల్స్, పర్చేజ్ ఆర్డర్లు పెట్టి ‘లెజెండ్’ఫార్మా కంపెనీ పేరుతో రూ.54 కోట్లను దారి మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది.దేవికారాణి ఆదేశాలతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన శ్రీహరిబాబు 2017లో రూ.19 కోట్ల ఆదాయపన్ను చెల్లించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరిచింది. శ్రీహరిబాబు నుంచి రూ.99 కోట్ల విలువైన షేర్స్ తోపాటు రూ.31 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. శ్రీహరిబాబు వద్ద స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్ల ఆధారంగా షెల్ కంపెనీ ‘లెజెండ్’ ఫార్మా ఎండీ కృపాకర్ రెడ్డి, ఆ కంపెనీ ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి ఇండ్లలో ఏసీబీ సోదాలు జరిపింది. ఇక్కడ లభించిన బిల్స్, పర్చేజ్, కిట్ల కొనుగోళ్ల ఆధారంగా 25 శాతం మార్జిన్ అమౌంట్ ను 250 శాతంగా చూపి రికార్డ్స్ క్రియేట్ చేసినట్టు గుర్తించింది. 2017‌‌‌‌‌‌‌‌–18 ఐఎంఎస్ బడ్జెట్ అమౌంట్ లో ల్యాబ్ కిట్స్, గ్లూకోజ్ కిట్స్ కొనుగోళ్ల పేరుతో రూ.31 కోట్లను ఎక్కువగా చూపి దారిమళ్లించినట్టు, ఈ బడ్జెట్ కాలంలో శ్రీహరిబాబు మొత్తం రూ.54 కోట్లను దారిమళ్లించినట్లు ఏసీబీ అధారాలు సేకరించింది.లెజెండ్ ఫార్మా కంపెనీ ఆర్థిక లావాదేవీలన్నీ వెంకటేశ్వర్ రెడ్డే చూసుకునేవాడు. శ్రీహరిబాబు ఎండీగా ఉన్న ఓమ్నీ మెడీ నుంచి లెజెండ్ ఫార్మాకు పర్చేజ్ ఆర్డర్స్ వెళ్లేవి. రూ.11,800 విలువ చేసే తెల్ల రక్తకణాలను కౌంట్ చేసే ల్యాబ్ కిట్ ను రూ.36,800గా చూపుతూ మొత్తం 6 వేల కిట్స్ కొన్నట్టు నకిలీ బిల్స్ క్రియేట్ చేశారు. ఇలా మొత్తం రూ.12 కోట్లు శ్రీహరిబాబు అకౌంట్స్ లో చేరినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఇదే కంపెనీ నుంచి రూ.1,980 విలువ చేసే గ్లూకోజ్ కిట్ ను రూ.6,200కు మొత్తం 4,500 కిట్స్ కొనుగోలు చేసినట్టు పర్చేజ్ ఆర్డర్స్ తయారు చేసినట్టు గుర్తించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో మరో రూ.19 కోట్లు శ్రీహరిబాబు అకౌంట్స్ లో పడినట్లు బ్యాంక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లెజెండ్ ఫార్మా పేరుతో 2017 నుంచి ఇప్పటి వరకు మూడేండ్లలో రూ.100 కోట్లకుపైగా ఐఎంఎస్ నిధులను దారిమళ్లించినట్లు ఏసీబీ చెబుతోంది. కృపాకర్ రెడ్డితోపాటు వెంకటేశ్వర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈఎస్ఐ స్కామ్ కేసులో మరికొన్ని అరెస్ట్ లు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Related Posts