అమ్మాయి కోసం.. గ్యాంగ్ వార్
విజయనగరం, జనవరి 2
ఓ అమ్మాయి విషయమై మొదలైన గొడవ బ్లేడులతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దాడుల్లో నలుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని లఖనాపురం గ్రామంలో రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం సీఐ దాశరథి, ఎస్‌ఐ వై.సింహచలంతో పాటు సిబ్బంది లఖనాపురం, పెదబుడ్డిడిలో ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడికి చెందిన అఖిల్, సురేష్, సంతోష్‌లు పార్వతీపురంలోని ఓ కళాశాలలో చదువుకుంటున్నారు.అలాగే లఖనాపురం గ్రామానికి చెందిన ముదిలి దినేష్‌కుమార్, శివ్వాల సంతోష్‌కుమార్, సొడవరపు వెంకటరమణ, ఎస్.సురేష్ కూడా పార్వతీపురంలోనే మరో కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే లఖనాపురానికి చెందిన ఓ యువతి ఫొటో అఖిల్ సెల్‌ఫోన్‌లో ఉండటంతో అమ్మాయి ఫొటో ఎందుకు ఉంచావని ముదిలి దినేష్ ప్రశ్నించాడు.ఈ విషయమై ఇద్దరి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ విషయాన్ని లఖనాపురం యువకులు జ్యోతి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం– పెదబుడ్డిడి బస్సులో వెళ్తుండగా లఖనాపురం బస్టాండ్ వద్ద అనూహ్యంగా పెదబుడ్డిడి యువకులు మెరుపుదాడికి దిగారు.బ్లేడులతో లఖనాపురం యువకులపై విరుచుకుపడ్డారు. దీంతో యువకులు గాయాలపాలయ్యారు. దీంతో గాయపడ్డ దినేష్‌కుమార్, సురేష్, వెంకటరమణలను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన సంతోష్‌కుమార్‌ను రావివలస ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, దాడికి పాల్పడిన సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా అఖిల్, సంతోష్ పరారయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత క్షణికావేశానికి లోరై నేరాలకు పాల్పడవద్దని సూచించారు.