పులులపై ఆగని దాడులు
ముంబై, జనవరి 2
దేశవ్యాప్తంగా 110 పులులు చనిపోయాయి. వీటిలో మూడోవంతు వేటగాళ్ల ఉచ్చుకే బలయ్యాయి. 110 లో 38 పులులకు సంబంధించిన కళేబరాల భాగాలను వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకోగా 26 అనారోగ్యంతో, 36 తమలో తాము పోట్లాడుకొని, 3 రోడ్డు లేదా రైలు ప్రమాదాల్లో, 6 రెస్క్యూ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాయి. పులుల మరణాల్లో (29) మధ్యప్రదేశ్ తొలి స్థానంలో, మహారాష్ట్ర (22) రెండో స్థానంలో నిలిచాయి. 2018లోనూ ఈ రెండు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ లెక్కలను ఎన్జీవో వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2018తో పోలిస్తే 2019లో వేటగాళ్ల దెబ్బకు బలైన పులులు పెరిగాయని.. 2018లో 34, 2019లో38 చనిపోయాయని తెలిపింది. 491 చిరుత పులులూ చనిపోయాయని, 2018తో పోలిస్తే చనిపోయిన వాటి సంఖ్య 9 తగ్గిందని తెలిపింది. వీటిలో 127 వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయని, 2018తో పోలిస్తే(169) ఈ సంఖ్య తక్కువని చెప్పింది. చిరుతల మరణాల్లో మహారాష్ట్ర (97) టాప్‌లో ఉందని.. వీటిలో 31 రోడ్డు, రైలు ప్రమాదాల్లో చనిపోయాయని వివరించింది.రోడ్డు, రైలు ప్రమాదాల్లో పులులు, చిరుతలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూపీఎస్ సెంట్రల్ ఇండియా డైరెక్టర్ నితిన్ దేశాయ్ అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ తగ్గడం, రహదారుల వెడల్పు వల్ల వాహనాలు వేగం పెరిగి అడవి జంతువులు ఎక్కువగా చనిపోతున్నాయన్నారు. పులుల రక్షణ కోసం పర్యవేక్షణ పెరిగినా, వాటి శరీర భాగాలకు డిమాండ్ పెరగడం మరింత ఆందోళనకరమని చెప్పారు. ఎన్‌టీసీఏ, -వైల్డ్‌లైప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో 2,967 పులులున్నాయి. 526 పులులతో మధ్యప్రదేశ్ టాప్‌లో ఉంది. మహారాష్ట్రలో 2014లో 190 పులులుంటే ఆ సంఖ్య 2018 నాటికి 312కి చేరింది.గుజరాత్‌లో 2020 సింహాల లెక్క కోసం 8 వేల నుంచి 10 వేల కెమెరాలను వాడబోతున్నారు. గతంలో 15 వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని సర్వే చేయగా ఈసారి 7 జిల్లాల్లోని 25 వేల కిలోమీటర్ల మేర జల్లెడ పట్టనున్నారు. మేలో జరగబోతున్న ఈ సర్వేలో తొలిసారి వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు పాల్గొనబోతున్నారు. గుజరాత్‌లో 2015లో సింహాల సంఖ్య 523. ఐదేళ్లలో ఈ సంఖ్య బాగా పెరిగి ఉండొచ్చని, వెయ్యి మార్క్‌ను దాటుండొచ్చని అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టెక్నాలజీని సింహాల లెక్కలకు వాడబోతున్నారు. ఈ పద్ధతి ప్రకారం సర్వే ప్రాంతాన్ని మూడు కిలోమీటర్ల గ్రిడ్లుగా విభజిస్తారు. ఫస్ట్ సుమారు 2 వేల మంది ఫీల్డ్ ఆఫీసర్లు సర్వే చేస్తారు. సింహాల వెంట్రుకలు, పండ్లు, గోర్లను సేకరిస్తారు. రెండో దశలో 10 వేల కెమెరాలతో సింహాల కదలికలను గమనిస్తారు.