YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చింతలపూడిపై చింత (పశ్చిమగోదావరి)

 చింతలపూడిపై చింత (పశ్చిమగోదావరి)

 చింతలపూడిపై చింత (పశ్చిమగోదావరి)
ఏలూరు, జనవరి 02 పశ్చిమలోని మెట్టను సస్యశ్యామలం చేయడంతో పాటు గోదారమ్మను కృష్ణమ్మ చెంతకు చేర్చాలనే మరో భగీరథ సంకల్పం ముందుకు సాగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. అదే చింతలపూడి ఎత్తిపోతల. పథకం పనులు ఆరంభంలో పరుగులు పెట్టినా.. ప్రస్తుతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లాతో పాటు పక్కనే ఉన్న మరికొన్ని జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని సంకల్పించారు. 2017లో ఈ పథకం మొదటి దశ పనులు వేగంగా సాగాయి. రెండో దశ పనులు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచాయి. ఇందులో కాలువల పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఏడాదిగా ముందుకు సాగడం లేదు. పథకంలో కీలకమైన లిఫ్టుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మొదటి లిఫ్టు తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిపై 14 పంపులతో, రెండో లిఫ్టు గుడ్డిగూడెం వద్ద 14 పంపులతో, మూడో లిఫ్టు రౌతుగూడెం వద్ద ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి లింకు కాలువ ద్వారా ఎన్నెస్పీ వేంపాడు మేజర్‌కు అనుసంధానం చేస్తారు. 2018 మార్చిలో ఈ లిప్టుల నిర్మాణాలు పూర్తి చేస్తామన్న అధికారులు ఇప్పటికీ ఓ రూపునకు తీసుకురాకపోవడం గమనార్హం. పశ్చిమలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. కొవ్వాడ కాలువ ప్రాజెక్టు కింద ఉన్న 17 వేల ఎకరాలు, ఎర్ర కాలువ కింద 28 వేల ఎకరాలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్నది లక్ష్యం. కృష్ణా జిల్లాలో 2.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందులో 2.10 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టుతో పాటు చిన్ననీటి పారుదల కింద మరో 70 వేల ఎకరాలు ఉంది.
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అదికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని..మూడు సంవత్సరాల్లో పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. రెండో దశలో అటవీ భూములకు అనుమతి రావడంతో పనులు  వేగవంతం చేస్తామని తెలిపారు.

Related Posts