YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్షకులకు అండగా.. (ప్రకాశం)

కర్షకులకు అండగా.. (ప్రకాశం)

కర్షకులకు అండగా.. (ప్రకాశం)
ఒంగోలు, జనవరి 02 (న్యూస్ పల్స్): రైతులు ఇక మీసేవ కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదు. వ్యవసాయశాఖ సిబ్బంది వద్ద ఈ-కర్షక్‌ యాప్‌లో పంట వివరాలు నమోదు చేసుకుంటే చాలు.పంటల బీమా వర్తిస్తుంది. ఈ రబీ నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది. రాష్ట్ర వ్యవసాయశాఖ పంటల బీమాపై సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.  2018లో రబీ వరకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద ఎంపిక చేసిన ఏజెన్సీకి రైతులే బీమా ప్రీమియం చెల్లించేవారు. ఆ తర్వాత ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. గడిచిన ఖరీఫ్‌కు కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించినా... రైతులు బ్యాంకులు, మీసేవ కేంద్రాల్లో పేర్ల నమోదుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక గత ఏడాది నవంబరులో రబీ పంటల బీమాకు షెడ్యూల్‌ విడుదల చేసినా... సంబంధిత వెబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నమోదు ప్రక్రియలోనూ మార్పులు చేసింది. ఇకపై ఈ -కర్షక్‌ యాప్‌లో పంటలు నమోదు చేసుకున్న వారికి బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రైతులకు వెసులుబాటు కలగనుంది.  నూతన విధానం అమలుకు వ్యవసాయశాఖను నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేశారు. పంటల బీమా పథకంలో చేరడానికి ముందుగా ఆధార్‌ కలిగిన సాగుదారుడి వివరాలు ఈ-కర్షక్‌ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌లో నమోదు చేస్తారు. అందుకోసం నిర్ణీత గడువు విధించారు. రబీలో శనగ పంటకు జనవరి 31, మిగిలిన అన్ని పంటలకు ఫిబ్రవరి 15 గడువుగా పేర్కొన్నారు. సొంత రైతు, కౌలు రైతు అనే వివరాలు ఈ - కర్షక్‌ యాప్‌ ద్వారా గుర్తిస్తారు. ఇకపై బ్యాంకు ద్వారా రుణం పొందేవారు... ఆయా బ్యాంకుల్లో బీమా కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకోనవసరం లేదు. రుణం పొందని వారు కామన్‌ సర్వీసు సెంట్లలో నమోదు చేసుకోనవసరం లేదు. ఏ బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబరు 1, 2019 తర్వాత బ్యాంకులు పంట రుణం నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఉంటే.. దానిని తిరిగి రైతులకు చెల్లిస్తారు. బ్యాంకులు రైతుల వద్ద వసూలు చేసిన ప్రీమియం సొమ్మును కంపెనీకి జమ చేసి ఉంటే తిరిగి చెల్లిస్తారు. అర్హత కలిగిన అన్ని క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత సాగుదారుని ఆధార్‌ అనుసంధాన బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. ఇకపై ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో ఈ- కర్షక్‌ యాప్‌ ద్వారా రైతులు వేసిన పంటలను నమోదు చేస్తారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసే రాయితీ పథకాలు మొత్తం దీని ఆధారంగానే అందజేస్తారు. రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి మొబైల్‌ అప్లికేషన్‌లో నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేడీఏ కార్యాలయంలో ఒక నోడల్‌ అధికారిని నియమిస్తారు. అంతర్‌ పంటలు, పండ్ల తోటలు, కూరగాయల సాగు... మొదటి, రెండు, మూడు పంటలు దేనికి దానికి యాప్‌లో సమగ్ర వివరాల నమోదుకు ఆప్షన్లు ఇచ్చారు.

Related Posts