పరిహారం.. పరిహాసం (ఖమ్మం)
ఖమ్మం, జనవరి 02 ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు తీరని పంట నష్టం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఆదుకునేందుకు ప్రభుత్వం పలు బీమా పథకాలను ప్రవేశపెట్టింది. వీటికి రైతులు ప్రీమియం చెల్లిస్తున్నారు. అయితే పంట నష్టం సంభవించి, అధికారులు సర్వే చేసి నివేదికలు పంపించినా రైతులకు బీమా పరిహారం అందటం లేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో పత్తి, మిరప, వరి, కంది, పెసర, మొక్కజొన్న, మామిడి తదితర పంటలకు రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద చేరి ప్రీమియం చెల్లిస్తున్నారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారు. ఈ పథకాల కింద రైతులకు సంబంధిత బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం చొప్పున చెరి సగం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం రైతులకు శాపంగా మారింది. 2017-18 ఖరీఫ్ వరకు మాత్రమే రైతులకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్లెయిమ్ కూడా పరిష్కరించలేదు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మొత్తం 51వేల మంది రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట కోత ప్రయోగాల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారు. వ్యవసాయ విస్తరణ అధికారి, బీమా కంపెనీ ప్రతినిధి, వీఆర్వోతో కలిసి ఇలా పంట నష్టాన్ని అంచనా వేస్తారు. మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాల ద్వారా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని అంచనా వేస్తారు. ఈ కేంద్రాలు ఆయా మండలాల్లోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని కేంద్రానికి సమాచారం అందిస్తాయి. కొన్ని మండలాల్లో ఈ కేంద్రాలు సరిగా పని చేయటం లేదు. సకాలంలో వాతావరణాన్ని నమోదు చేయటం లేదు. నాలుగైదు సంవత్సరాల నుంచి జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మిరప పంట పొలాల్లో, కళ్లాల్లో తడిసి రంగు మారుతోంది. అలాగే వరి, పత్తి, మొక్కజొన్న, మామిడి పంటలు సైతం అకాల వర్షాలకు దెబ్బతింటున్నాయి. పంట నష్టం జరగటం, నాణ్యత లేకపోవటంతో ధరలు తగ్గి రైతులు దిగాలు పడుతున్నారు. ఇలా తరచూ జిల్లాలో జరుగుతున్నా రైతులకు మాత్రం పంట నష్ట పరిహారం మంజూరు కావటం లేదు. పంటల బీమా పథకాల గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవటంతో చాలామంది నమోదు చేసుకోలేకపోతున్నారు. వేంసూరు మండలం కందుకూరు ఆంధ్రా బ్యాంకు పరిధిలో కందుకూరు రెవెన్యూ పరిధిలో 2015లో 511 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. 511 మంది రైతుల ఖాతా నుంచి బీమా కంపెనీకి జమ చేసిన మొత్తం రూ.10,32,000. మొత్తం 1977 ఎకరాలకు ఎకరానికి రూ.522 చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. ఎకరానికి బీమా నష్ట పరిహారం 76.85 శాతం. ఎకరానికి 2015లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.20,880. ఎకరానికి ఇవ్వాల్సిన బీమా పరిహారం రూ.16,046.మొత్తం 1977 ఎకరాలకు రావాల్సిన పరిహారం రూ.3.17 కోట్లు. కానీ, బీమా కంపెనీ వారు వరంగల్ జోనల్ కార్యాలయానికి పంపింది కేవలం రూ.13 లక్షలు మాత్రమే. ఇవి కూడా ఇప్పటి వరకు వరంగల్ జోనల్ కార్యాలయంలోనే ఉన్నాయి.