ఖమ్మంలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
ఖమ్మం, జనవరి 2,
రోజూ వెంటబడి వేధిస్తున్న యువతి తనను పట్టించుకోకపోవడంతో రౌడీషీటర్ రెచ్చిపోయాడు. నూతన సంవత్సర వేడుకల వేళ ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా అతడిని అడ్డుకోబోయిన ఆమె అమ్మమ్మను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలో మంగళవారం రాత్రి జరగగా బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.ఖమ్మం నగరానికి చెందిన ఓ వృద్ధురాలు, మనవరాలు కలిసి ఇంటి బయట కూర్చున్నారు. వీధిలో మహిళలు ముగ్గులు వేస్తుండగా గమనిస్తున్నారు. నూతన సంవత్సరం ఆరంభం కాగానే స్థానికులంతా ఆనందోత్సాహాలతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదే సమయంలో నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ అనే రౌడీషీటర్ అక్కడకు వచ్చాడు. వృద్ధురాలి ఇంటి ముందుకెళ్లి ఆమె మనవరాలిపై ఆకస్మాత్తుగా దాడిచేశాడు. అడ్డుకోబోయిన అమ్మమ్మ కడుపులో కత్తితో పొడిచాడు.దీంతో బాధితులు ఇంట్లోకి వెళ్లి తలుపు గడియపెట్టుకున్నారు. ఇంటి ముందు వీరంగం వేస్తున్న అతడిని అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులకు కత్తి చూపిస్తూ పారిపోయాడు. స్థానికులిచ్చిన సమాచారంతో టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆస్పపత్రికి తరలించారు. యువతి ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె రోజూ నడుచుకుంటూ కాలేజీకి వెళ్తుంటుంది. దీన్ని పసిగట్టిన ప్రేమ్‌కుమార్ నెలరోజులుగా ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు. తన జోలికి రావద్దని యువతి హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని విద్యార్థిని ఇంట్లో చెప్పగా కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో యువతిపై ప్రేమ్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. అయితే సంఘటనా స్థలం నుంచి పారిపోయిన నిందితుడు చెవి కోసుకుని ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటనపై బాధిత కుటుంబం బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.