భారత ఇతిహాస చరిత్రలో శ్రీరామచంద్రుడిది ప్రత్యేక స్థానం. రామ అంటే రమణీయం. ఆయన నామస్మరణలోనే మనకు ఆనందం లభిస్తుంది. ఒక పరిపూర్ణ మానవుడిగా ఎలా ఉండాలో ఆచరణలో చూపించాడు ఆ శ్రీరాముడు. ఆయన బాటలో నడిస్తే అంతా అలౌకిక ఆనందమే. పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, సకల గుణాభిరాముడిగా, కరుణాపయోనిధిగా, అగ్రజుడిగా, తండ్రిగా, ప్రజాపాలకుడిగా... ఇలా ఏ రూపంలో చూసినా సకల గుణాలు శ్రీరామునిలో కనిపిస్తాయి. మరి ఆ సకల గుణాభి రాముడి జన్మదినాన్ని శ్రీరామనవమి పర్వదినంగా జరుపుకుంటారు.
చైత్రమాసంలో నవమినాడు శ్రీరామనవమి పర్వదినం వస్తుంది. మామిడిచెట్టు గుబుర్లలో కూర్చుని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కళకళలాడిపోతుంటుంది. ముందుగా చైత్రంలో వసంతరుతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంతరుతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ‘పుష్పమాసే హితరావహ సంఘర్షదివ పుష్పితా’ అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట. ఉగాది పండగ రోజు చేదు, తీపి పచ్చడి తినడంతో పాటు శ్రీరామనవమి వేడుకలు కూడా మొదలవుతాయి.
తొమ్మిది రోజుల పండగ ఇది
రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని ‘దేవ రహస్యం’ అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా- జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు- దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.
రావణుడి మీద సాధించిన విజయం, సీతతో అతని వివాహం, పట్టాభిషేకం, ఈ మూడూ కలిపి వేడుకగా నిర్వహించే పండగే ఇది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పండగగా జరుపుకుంటారు. గ్రామాలలో హరికథలు చెప్తారు. ప్రతి వీధిలో నవమి పందిళ్లు వెలుస్తాయి. సీతారామ కల్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్లు నెలవవుతాయి. హరికథా కాలక్షేపం ముఖ్య కార్యక్రమం. సంగీత కార్యక్రమాలు, నంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి.
ఆ పర్వదినాన...
శ్రీరామనవమి రోజున స్నానాదికాలు ముగించి, కొత్త బట్టలు ధరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు.వాకిట్లో రంగవల్లులు దిద్ది, గుమ్మానికి తోరణాలు కట్టి, గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతారు. లక్ష్మణ, భరత, శతృఘ్నులు, హనుమంతుడితో కూడిన సీతారాముల చిత్ర పటమును అలంకరించి, శ్రీరామచంద్రుడి అష్టోత్తరం చదవడం గానీ, రామాయణంలోని పట్టాభిషేక అధ్యాయాన్ని పారాయణ గానీ చేస్తారు. నైవేద్యంగా వడపప్పు, -పానకాన్ని సమర్పిస్తారు.
ఇక దేవాలయ మంటపంలో ఉత్సవమూర్తులకు జరిగే కల్యాణం కనుల పండువగా ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ జరిగే భజనలు, కోలాటాలు భక్తిని ఉత్సాహపు మార్గంలో ఉరకలు వేయిస్తాయి. కల్యాణం పూర్తి అయిన తరువాత స్వామివారి తరఫున గాని, అమ్మవారి తరఫున గాని కట్న కానుకలు చదివించుకుని, అక్షింతలను తలపై వేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు.
వడపప్పు, పానకం
రామనవమికి చేసే ప్రసాదాలు కూడా వైద్యపరంగా శరీరానికి మేలు చేస్తాయి. పానకం తయారు చేయడానికి వాడే పదార్థాల వలన కలిగే ఉపయోగాల గురించి ఆయుర్వేదం చెప్తుంది. తలనొప్పి, కడుపునొప్పి, గొంతునొప్పికి మంచి ఔషధం మిరియాలు. జలుబు, దగ్గుకి పానకం మందులాగా పనిచేస్తుంది. బెల్లంలో ఐరన్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. పానకం ఎండాకాలంలో వాత, కఫ, పిత్త దోషాలు మూడింటిని నియంత్రిస్తుంది. ఎండ తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. సత్వర శక్తిని అందించే గుణం పానకానికి ఉంటుంది. పానకంలో శొంఠిపొడి కూడా వేస్తారు. దాని వలన ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
వడపప్పు కోసం నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, మామిడి కాయ ముక్కలు వేస్తారు. పెసరపప్పులో పీచు, ప్రొటీన్లు ఉంటాయి. పొటాషియం, కాల్షియం, బి కాంప్లెక్స్ ఉంటుంది. శరీరాన్ని చల్లబరిచే గుణం పెసరపప్పుకూ ఉంటుంది. పానకం, వడపప్పును కలిపి తీసుకోవడం వలన అరుగుదల వ్యవస్థ మెరుగు పడుతుంది.
తెలుగువారి పెళ్ళిపత్రికల్లో...
శ్రీరాముడికి వివాహం తరువాతనే పట్టాభిషేకం జరిగింది. భద్రాచలంలో రామదాసు గారు ప్రతి సంవత్సరం ఆచరిస్తూ వచ్చిన శ్రీ సీతారామ కల్యాణాన్ని ఈ నాటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో మనమంతా తిలకించి తరిస్తూ ఉంటాం. అక్కడ వాడిన తలంబ్రాలు సంపాదించి ఇంట్లో పెట్టుకుని వివాహం సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు ఎందరో ఉపయోగిస్తూ ఉంటారు. తెలుగు వారు శుభలేఖలో ,
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
వ్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికకలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః
అని రాసుకుని, శ్రీ సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని స్మరిస్తూ, ఆశీర్వాదం పొంది ఆ తరువాతే మిగతా వివరాలు రాసుకుంటారు.
సకల గుణాభిరాముడు ఆ శ్రీరాముడు
గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతం సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు.
ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదుకోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా- సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.
రామకథాగానం
‘రామకథా సుధా రసపానము రాజ్యము సేయనై’ అన్నాడు త్యాగయ్య. శ్రీరామనవమికి ఊరూరా అందమైన పందిళ్ళల్లో రామకథా గానం ఒక రమణీయమైన ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ.
కరుణాపయోనిధి భద్రగిరి రామయ్య
పవిత్ర గోదావరి నదీతీరంలోని భద్రాద్రిలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయం దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. వనవాసకాలంలో స్వామివారు సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడే నివాసమున్న పవిత్రనేల ఇది. పర్ణశాల నుంచే అమ్మవారిని రావణాసురుడు అపహరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
భద్రగిరి
మేరు, మేనకల పుత్రుడైన భద్రుడు మునిపుంగవుడు. స్వామివారు పర్ణశాలలో నివాసమున్న విషయం తెలుసుకొని దర్శించుకుంటారు. అనంతరం రాముల వారు సీతాన్వేషణకు బయలుదేరుతారు. రావణవధ అనంతరం అక్కడకు విచ్చేస్తానని భద్రునికి వరమిస్తాడు. కొంత కాలానికి రావణ వధ జరగడం, శ్రీరామ పట్టాభిషేకం వెంట వెంటనే జరిగిపోతాయి. భద్ర మహర్షి శ్రీరామ దర్శనం కోసం తపస్సు చేస్తాడు. భక్తుని తపస్సును గమనించిన వైకంఠరాముడు యావత్ వైకుంఠమే కదిలివచ్చిన రీతిలో భద్రుడికి ప్రత్యక్షయ్యాడు. తాను కొండగా ఉంటానని తనపై స్వామివారు అధిష్ఠించాలని భద్రుడు కోరుకుంటాడు. భక్తుని కోరిక ప్రకారమే భద్రగిరిపై సీతాసమేతంగా స్వామి వెలిశారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీరామ కల్యాణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు భద్రాద్రికి చేరుకుంటారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను రాములవారికి సమర్పిస్తారు. అంగరంగవైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు రెండు కన్నులు చాలవంటే అతిశయోక్తికాదు.
తారక మంత్రం
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనో పాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ‘‘ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!’’ అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
ఈ శ్లోకం మూడుమార్లు స్మరిస్తే చాలు ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.