కాకినాడ లో “ప్రత్యేక తపాలా కవర్ల విడుదల” కార్యక్రమం
ది. 02.01.2020వ తేది గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు సూర్య కళా మందిర్, కాకినాడ లో “ప్రత్యేక తపాలా కవర్ల విడుదల” కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా కాకినాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు, గౌరవ అతిధులుగా కాకినాడ నగర మేయర్ శ్రీమతి సుంకర పావని గారు, కాకినాడ నగర నియోజక వర్గ గౌరవ శాసన సభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ యం.వెంకటేశ్వర్లు గారు, పోస్టుమాస్టర్ జనరల్, విశాఖపట్టణం విచ్చేసినారు. ఈ కార్యక్రమానికి స్థానికి కాకినాడ పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ అల్లువాడ ఈశ్వరరావు గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భముగా 1962 లో స్థాపించిన “గాన కళ” కర్ణాటక శాస్త్రీయ సంగీత మాస పత్రిక సంపాదకులు కీర్తి శేషులు శ్రీ మునుగంటి శ్రీరామమూర్తి గారి పేరిట మరియు 119 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాకినాడ కోటయ్య కాజా పేరిట తపాలా శాఖ ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేసింది. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వము-తపాలా శాఖ, “గాన కళ” పత్రికా సంపాదకులు శ్రీ
మునుగంటి వెంకట రావు గారు, కోటయ్య కాజా యాజమాన్యం సంయుక్తముగా నిర్వహించారు. విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. శ్రీ యం. వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా కింగ్ ఆఫ్ హాబీస్ ఐన ఫిలాటలి హాబి గురించి మాట్లాడుతూ ఈ ప్రత్యేక కవర్ల విశిష్టత గురించి సభికులకు తెలియజేస్తూ తపాల శాఖలోని వివిధ సేవలను అందరు తప్పక వినియోగించుకోవాలని
కోరారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు మాట్లాడుతూ మునుగంటి వారి కుటుంబం మూడు తరాలుగా కర్ణాటక సంగీత వైభవాన్ని కాపాడుతూ, శ్రీరామ సమాజం అనే పాఠశాల ద్వారా ఎందరో కళాకారులను వెలుగు లోనికి తీసుకొని వచ్చారని, ఈ హై టెక్ యుగములో కూడా సంగీతానికి సంబంధించిన ఒక మాస పత్రికను నడపడటం మాటలు కాదని శ్రీ మునుగంటి శ్రీరామమూర్తి గారి కుమారుడు శ్రీ మునుగంటి వెంకటరావు గారిని కొనియాడారు. ఈ పత్రిక నిరంతరాయంగా సంగీతప్రియులైన చందాదారులకు చేరాలంటే, పోస్టల్ డిపార్టుమెంటు వారు రాయితీతో కూడిన పోస్టేజీ సదుపాయమును కలిపించాలని కోరారు. దీనికి వెను వెంటంటే పోస్టల్ అధికారులను సానుకూలముగా స్పందించారు. కాకినాడ కాజా గురించి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వపడేలా చేసిన ఈ కోటయ్య కాజా పేరు ఢిల్లీ స్థాయి వరకు చేరిందని, కాకినాడ కాజా యొక్క స్వతసిద్ధమైన రుచిని కోల్పోకుండా, కొబ్బరిబొండములో నీళ్ళు త్రాగినట్లు, కాకినాడ కాజా లోపలి భాగములో గల తియ్యని పాకాన్ని ఆస్వాదించటం ఒక గొప్ప అనుభూతి అని కొనియాడారు.గౌరవ శాసన సభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ కాకినాడ కాజా నాణ్యతను కాపాడాలని, తర తరాలకు ఈ స్వీట్ యొక్క తీపి గుర్తులు అందాలని ఆకాంక్షించారు.
మునుగంటి వారి కుటుంబం వారికి బాల్యము నుండి తెలుసునని, సంప్రదాయ సంగీతాన్ని కాపాడుకుంటూ ఒక మాసపత్రికను నడపటం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కాకినాడ నగర మేయర్ శ్రీమతి సుంకర పావని గారు మాట్లాడుతూ శ్రీ మునుగంటి వెంకటరావు గారు పి.ఆర్. కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేసారని, అదే కళాశాల పూర్వ విద్యార్థినిగా ఆమె ఎంతో గర్వపడుతున్నారని తెలిపారు. కాకినాడ కాజా గురించి మాట్లాడుతూ ఈ కోటయ్య కాజాని కాకినాడ కాజా గా ప్రసిద్ధికెక్కింది అని తెలిపారు. ఈ ప్రత్యేక కవర్ల విడుదల కార్యక్రమాలకి గానకళ సంపాదకులు శ్రీ మునుగంటి వెంకటరావుగారు, కాకినాడ కోటయ్య కాజా యజమానులు శ్రీ నిరోగి వెంకట సత్య శివ రామమూర్తి గారు హాజరుఅయినారు. ఈ సందర్భముగా పోస్టల్ అధికారులు, అతిధులకు మై స్టాంప్ జ్ఞాపికలను అందచేసారు.వివిధ సందర్భాలలో నిర్వహించిన క్విజ్ మరియు వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకుగౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు మరియు మేయర్ గారి ద్వారా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ఔత్సాహిక సంగీత ప్రియులు, సంగీత కళాకారులు, మేధావులు, తపాలా సంస్థ అధికారులు, ఉద్యోగులు, కాకినాడ ప్రజలు హాజరు అయ్యారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కాకినాడ డివిజన్