YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

ఇన్సూరెన్స్  కోసం దృశ్యం సినిమా సీన్

ఇన్సూరెన్స్  కోసం దృశ్యం సినిమా సీన్

ఇన్సూరెన్స్  కోసం దృశ్యం సినిమా సీన్
కరీంనగర్, జనవరి 3
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. కొంత కాలంగా నగల వ్యాపారం చేస్తున్నారు. డిసెంబర్ 31న రాత్రి అందరూ నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా.. వారిద్దరూ భారీ దొంగతనం జరిగినట్లు హైడ్రామా ఆడారు. తమ నాటకాన్ని రక్తి కట్టించడానికి ‘దృశ్యం’ సినిమా ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. కుటుంబంతో కలిసి ఒకరు హైదరాబాద్‌కు, మరొకరు వరంగల్‌కు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఇళ్లు గుల్ల అయినట్లు జనాన్ని నమ్మించారు. అయితే.. చోరికి గురైనట్లు చెప్పిన నగలన్నీ అంతకు ముందు రోజే వివిధ చోట్లకు తరలించి భద్రపరిచారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. ఇంతకీ ఇంత డ్రామాకు తెరతీయడానికి కారణం.. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనే దురాశే.కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేశ్, భాస్కర్‌ అన్నదమ్ములు. స్థానిక గాంధీ చౌక్‌లో ఓ షాప్‌ను అద్దెకు తీసుకొని ‘విజయ లక్ష్మి ట్రేడర్స్‌ అండ్ జ్యూవెల్లర్స్‌’ పేరుతో బంగారు దుకాణం నడుపుతున్నారు. అయితే షాప్ యజమాని బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు దాన్ని సీజ్‌ చేశారు. దీంతో ఆ సోదరులిద్దరూ నగలన్నింటినీ తమ ఇంటికి మార్చుకున్నారు. అక్కడి నుంచే వ్యాపారం సాగిస్తున్నారు.అన్నదమ్ములిద్దరూ వ్యాపార నిమిత్తం భారీగా రుణాలు తీసుకున్నారు. వీటిలో ప్రైవేట్ రుణాలతో పాటు, ఎస్‌బీఐలో ముద్ర రుణాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వీరిలో దురాశ కలిగింది. ఎలాగైనా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టాలని భావించారు. అందుకోసం పక్కా ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట భారీగా బంగారం, వెండి కొనుగోలు చేశారు. షాప్ పేరిట బిల్లులు తీసుకున్నారు. ఇదంతా చోరీకి గురైనట్లు నమ్మించి, బ్యాంక్స్‌ ముద్ర రుణాలపై ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవాలని పథకం వేశారు.తమ ప్రణాళికలో భాగంగా నిందితులిద్దరూ  ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలన్నింటినీ వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం బీరువాలను పగలగొట్టి ఇంట్లో వస్తువులన్నింటినీ చిందరవందరగా పడేశారు. దొంగతనం జరిగినట్లు సీన్ క్రియేట్ చేశారు.భాస్కర్ తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్నంటూ ఇరుగు పొరుగు వారిని నమ్మించి మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో వరంగల్‌ వెళ్లిపోయాడు. బ్యాంకు అధికారులు నగల దుకాణం సీజ్‌ చేసిన అంశంపై లాయర్‌తో మాట్లాడటానికని చెప్పి మహేశ్ అప్పటికే హైదరాబాద్‌ బయల్దేరాడు. అదే రోజు రాత్రి జమ్మికుంట తిరిగొచ్చిన భాస్కర్‌.. కుటుంబ సభ్యులను తన కొత్త ఇంటి వద్ద దింపి, తనొక్కడే షాప్‌ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. తాను పగులగొట్టి తెచ్చిన తాళాన్ని ప్రధాన ద్వారానికి వేసి దొంగతనం జరిగిందని లబోదిబోమన్నాడు.చుట్టుపక్కల వారిని, బంగారం వ్యాపారుల సంఘం సభ్యులను చోరీ జరిగినట్లుగా భాస్కర్ నమ్మించాడు. ఇదే సమయంలో మరో నిందితుడు మహేశ్‌.. తాను హైదరాబాద్‌ నుంచి వస్తుండగా ఫోన్‌ ద్వారా సమాచారం తెలిసినట్లు నటించాడు. ఇదే స్టోరీతో పోలీసులను ఆశ్రయించాడు. భారీగా సొత్తు, బంగారం దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు.కేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను, పట్టణంలో పాత నేరస్థుల చిట్టాను పరిశీలించారు. ఘటన జరిగిన రోజు ఆ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేకపోవడంతో అది ఇంటి దొంగల పనేనని భావించారు. అన్నదమ్ములిద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం కక్కేశారు.బ్యాంకు రుణాలను ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో యజమానులే ఈ డ్రామాకు తెరతీసినట్లు పోలీసులు తేల్చారు. నిందితులిద్దరూ పక్కా ప్రణాళికతో నేరం జరిగినట్లు చిత్రీకరించారని వివరించారు. వివిధ ప్రాంతాలకు తరలించిన 700 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని రికవరీ చేశారు. వాటి విలువ మొత్తం రూ.11,70,000 ఉంటుందని తెలిపారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే కేసును చేధించిన పోలీస్ సిబ్బందిని కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు. భారీ చోరీ జరిగిందని ఆందోళన చెందిన స్థానికులు.. అన్నదమ్ములే డ్రామా ఆడారని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts