YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గట్లు జాగ్రత్త

గట్లు జాగ్రత్త

గట్లు జాగ్రత్త (విజయనగరం)
విజయనగరం, జనవరి 03 :ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఏటా జిల్లాలో సరిహద్దులను దాటే క్రమంలో నాగావళి నదిలో పెద్దస్థాయిలో నీరు చేరుతోంది. ఇదే సమయంలో ప్రధానంగా కొమరాడ మండల పరిధిలోని పంట పొలాలు, ఊరూవాడను ముంచెత్తుతున్నాయి. 2006లో కొమరాడ మండలం పొడుగువలస నుంచి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టిపూడివలస వరకు రూ.22 కోట్ల వ్యయంతో కరకట్ల నిర్మాణం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొమరాడ నుంచి ప్రారంభమైన ఈ పనులు నాగావళి నదికి కుడి వైపుగా కూనేరు నుంచి కొమరాడ మీదుగా కళ్లికోట వరకు, పొడుగువలస నుంచి దళాయిపేట మీదుగా బిత్రపాడు వరకు కరకట్టల పనులు సాగాల్సి ఉంది. మధ్యలో కొన్నిచోట్ల స్ట్రెక్చర్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కొరిశిల, పూర్ణపాడు లాబేసు, కళ్లికోట వద్ద మట్టికట్టలు నిర్మాణాలు చేపట్టారు. కాని పూర్తిస్థాయిలో పనులు జరగక చేసిన పనులు వృథాగా దర్శనమిస్తున్నాయి. నిర్మాణ చర్యల్లో భాగంగా పలుచోట్ల భూసేకరణ చేయాల్సి వచ్చింది. నమూనాలు మార్చాలని కొంతమంది జిరాయితీ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వరద కట్టల పనులకు నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పటి వరకు నిర్మించిన మట్టికట్టలు కిందకు జారిపోతున్నాయి. మరోపక్క కళ్లికోట, దళాయిపేట వద్ద మట్టికట్టల వల్ల కింద పొలాల్లోకి వరద నీరు చేరి ముంపునకు గురవుతున్నాయి. మొత్తం 9.5 కిలోమీటర్ల వరకు మట్టికట్టలు నిర్మాణం చేపట్టారు. 14 చోట్ల స్ట్రెక్చర్లు, పూర్ణపాడు వద్ద సీసీ గోడ నిర్మాణం చేపట్టారు. ఇంకా 13 చోట్ల స్ట్రెక్చర్ల నిర్మాణాలు జరగాల్సి ఉంది. ఇప్పటికీ రూ.11.82 కోట్ల వరకు వ్యయం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులను ఒప్పించే దిశగా రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు అడుగులు వేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కరకట్టల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగితే లోతట్టు ప్రాంతాలతో పాటు, రోడ్డు పైకి వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. సరుగుడగూడ వద్ద నాగావళి తీరాన 400 మీటర్ల వరకు రాళ్లతో కాంక్రీట్‌ పనులు చేపట్టారు. ఇది కొంత వరకు రోడ్డుపైకి నీరు చేరకుండా అడ్డుపడుతుంది. కాని కింద భూముల్లోకి నీరు చేరడంతో అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ పనులు వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో నాగావళి నదికి వరద వస్తుందన్న విషయం ఎగువన ఉన్న ఒడిశా అధికారులు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి. కాని అలా జరగకపోవడంతో ఒక్కసారిగా వచ్చే వరదనీటితో ముంపునకు గురవుతున్నాయి. ఈసమస్యను పరిష్కరించేందుకు ముందుగా వరద తీవ్రత తెలుసుకునేందుకు సరగుడగూడ వద్ద పరికరాన్ని ఏర్పాటు చేసే దిశగా రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల సబ్‌ కలెక్టర్‌ చేతన్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఎప్పుడు వరదలు వచ్చినా తోటపల్లి బ్యారేజీ వరకు వరద నీరు చేరితేనే ప్రవాహాన్ని అంచనా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా సరుగుడగూడ వద్దే పరికరాలను ఏర్పాటు చేస్తే ముందుగానే వరదను అంచనా వేసి లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా చేయగలమని భావించారు. ఈ పనులు కూడా ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

Related Posts