YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

‘ఆదరణ’కు నోచుకోలేదు (ప్రకాశం)

‘ఆదరణ’కు నోచుకోలేదు (ప్రకాశం)

‘ఆదరణ’కు నోచుకోలేదు (ప్రకాశం)
ఒంగోలు, జనవరి 03  జిల్లాలో ఆదరణ పథకం కింద పరికరాలు అందని వారు వేల సంఖ్యలో ఉండగా అదిగో, ఇదిగో అంటూ ఇప్పటివరకు ఊరిస్తూ వచ్చిన అధికారులు... తీరా డిపాజిట్లు వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం పాత పథకాలను రద్దు చేయడంతో పరికరాలు అందని వారికి, వారు వాటాగా చెల్లించిన పది శాతం నగదును వాపసు చేయాలని బీసీ కార్పొరేషన్‌ నుంచి ఆదేశాలు అందాయి. దాంతో అధికారులు ఆ మేరకు లెక్కలు తీస్తుండగా పరికరాల కోసం ఎదురు చూస్తున్న వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వృత్తిదారులకు చేయూతనందించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం అమలు చేశారు. బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యాన కుట్టు, వాషింగ్‌ మిషన్లు, మత్స్యకారులకు తెప్పలు తదితర 34 రకాల యూనిట్లను 90 శాతం రాయితీపై పంపిణీ చేశారు. యూనిట్‌ విలువలో పది శాతం మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాల్సివుండటంతో జిల్లావ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. లబ్ధిదారులుగా ఎంపికైన వారు తమ వాటా కింద పది శాతం నగదుకు డీడీ తీసి సంబంధిత కార్యాలయాల్లో అందజేశారు. అందులో ఎక్కువ శాతం పరికరాలు అప్పట్లోనే అధికారులు గుర్తించిన గోదాములకు చేరాయి. విడతల వారీగా వాటిని కొందరికి పంపిణీ చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో మండలాలకు చేరిన పరికరాలు మూలనపడ్డాయి. ఎట్టకేలకు వాటిని పంపిణీ చేయాలని ఇటీవల ఆదేశాలు అందగా ఆ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. లబ్ధిదారుల జాబితా ఆధారంగా మండల పరిషత్తు కార్యాలయాలకు చేర్చారు. అయితే డీడీలు చెల్లించినా పరికరాలు మంజూరు కాని వారికి డిపాజిట్లు వెనక్కి ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించడం లక్షిత వర్గాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పరికరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ నుంచి ఆదేశాలు రావడంతో అధికారుల్లో కొంత కదలిక వచ్చింది. ప్రధానంగా తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు తెప్పలు మంజూరు చేశారు. వాటి జీవిత కాలం ఏడాది కాగా గత పది నెలలుగా ఒక దాంట్లో మరొకటి వేసి నిల్వ పెట్టడంతో లోపలి భాగం పూర్తిగా దెబ్బతింది. వాటిని లబ్ధిదారులకు ఇచ్చినా వేటకు పనికిరావని భావిస్తున్నారు. దాంతో వారు ఏజెన్సీ నుంచి వాటిని తీసుకునేందుకు అనాసక్తి చూపుతున్నారు. కొన్ని ఇప్పటికీ జిల్లా బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఓ మూల పడి ఉన్నాయి. జిల్లాకు చేరిన యూనిట్ల పంపిణీలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో 5,480 మంది లబ్ధిదారులకు పరికరాల పంపిణీ ఇక లేనట్లే. వారందరికీ పది శాతం వాటా కింద చెల్లించిన నగదును వాపసు చేయడానికి లెక్కలు సేకరిస్తున్నారు. మండలాల నుంచి నివేదికలు రాగానే కార్పొరేషన్‌ నుంచి డబ్బు వాపసు చేయనున్నారు.

Related Posts