కంటికి వెలుగు (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, జనవరి 03 కంటి వెలుగు కార్యక్రమంలో శస్త్రచికిత్సల కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్న బాధితులకు ఊరట లభించనుంది. కంటి శుక్లాలు, ఉన్నత స్థాయి శస్త్ర చికిత్సలు బాధితులకు జరపడానికి సర్కారు చర్యలు ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా 19 ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించింది. అక్కడ అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. త్వరలో వైద్య నిపుణులను ఏర్పాటు చేయనున్నారు. జనవరిలో శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యే అవకాశాలుంటాయని వైద్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడేవారు ఉండకూడదని, అంధత్వం లేని తెలంగాణ సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గతేడాది ఆగస్టు 15న ప్రారంభించింది. గత ఏడాది మార్చి నాటికి కంటి వెలుగు శిబిరాలు ముగిశాయి. ప్రతి గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించారు. చూపు మందగించిన వారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసెస్ (చదువుకోవటానికి కళ్లద్దాలు) అందించారు. ప్రత్యేక కళ్లద్దాలు అవసరమైన వారికి బాధితుల చూపు వివరాల నివేదికలు సరఫరా కంపెనీలకు పంపించి తయారు చేయించి వారికి అందించారు. మరి కొందరికి ఇంకా ప్రత్యేక కళ్లద్దాలు సరఫరా కావాల్సి ఉంది. జిల్లాలో ఈ విధంగా 472 గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి 99.37 శాతం లక్ష్యాన్ని సాధించారు. శిబిరాల్లో పురుషులు 1,58,032, మహిళలు 1,91,308, ఇతరులు 33 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారుగా గుర్తించిన 36,472 మందికి త్వరలో ప్రభుత్వం చేపట్టనున్న శస్త్ర చికిత్సల వల్ల ప్రయోజనం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కంటి శస్త్ర చికిత్సలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం 19 సర్కారు ఆసుపత్రులను ఆధునికీకరించింది. వీటిలో ఉమ్మడి జిల్లాలో కంటి శస్త్ర చికిత్సల కోసం మంచిర్యాల, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ వైద్య కళాశాల (రిమ్స్)లో ఇప్పటికే నేత్ర విభాగం కొనసాగుతోంది. కుమురం భీం జిల్లా వారికి మాత్రం ఆదిలాబాద్ లేదా మంచిర్యాలలో ఇలాంటి చికిత్సలు చేసే అవకాశాలున్నాయి. జిల్లావ్యాప్తంగా 2018 ఆగస్టు 15 నుంచి 2019 మార్చి వరకు నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల్లో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు అవసరమైన వారు 25,383 మందిని గుర్తించారు. కంటికి సంబంధించిన ఇతర శస్త్రచికిత్సలు అవసరం ఉన్న బాధితులు 11,090 మందిని గుర్తించారు. వీరంతా తొమ్మిది నెలలుగా శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. భారమైనప్పటికి కొందరు అత్యవసరమైన ప్రైవేటులో ఇలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. జిల్లాలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఏడున్నర నెలల పాటు నిర్వహించిన శిబిరాల్లో శుక్లాల తొలగింపు, ఇతర రకాల శస్త్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉన్న వారు 36,472గా వైద్యారోగ్య సిబ్బంది గుర్తించారు.
-----------