YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

మన్యంలో వైద్యమెలా..?

మన్యంలో వైద్యమెలా..?

మన్యంలో వైద్యమెలా..? (ఖమ్మం)
భద్రాచలం, జనవరి 03 మన్యంలోని ఆరోగ్య ఉప కేంద్రాలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో అంతులేని అలసత్వం కనిపిస్తోంది. పర్యవేక్షణ లోపంతో వచ్చే సమస్యలే అధికంగా ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి విఘాతం కలుగుతోంది. ఏఎన్‌ఎంలతో పాటు రెండో ఏఎన్‌ఎంలు ఇందులో పని చేస్తుండగా ఈ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూపర్‌వైజర్లు దిశ నిర్దేశం చేస్తుంటారు. వీరంతా ఉప కేంద్రాల్లో అందుబాటులో ఉంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. ఇలాంటి సిబ్బంది ఉండడానికి సరైన గూడు లేక ఇబ్బందులు తలెత్తుతుండగా ఇంకొన్ని చోట్ల నిర్మాణాలు ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు ఉండడం లేదు. ఇంజినీరింగ్‌ వైఫల్యంతో సకాలంలో నిర్మాణాలను అప్పగించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36 శాతం గిరిజనులు ఉంటున్నారంటే వారి ఆరోగ్యం పట్ల ఏ స్థాయిలో శ్రద్ధ తీసుకోవాలో గుర్తించాలి. భద్రాచలం రంగనాయకులగుట్ట మీద అంగన్‌వాడీ కేంద్రం ఒక భాగంలో ఉండగా మరో పక్కన ఉప కేంద్రం ఉంది. దీన్ని గత ఏడాది నిర్మించగా ఆరు నెలల కిందట ప్రారంభించారు. అంగన్‌వాడీ బడికి వచ్చే పిల్లలు మల, మూత్ర విసర్జనకు వెళ్లాలంటే సదుపాయం లేదు. ఈ రెండు కేంద్రాలకు నీటి సమస్య ఉంది. చేతి పంపు ఉన్నప్పటికీ మోటార్‌ను బిగించకపోవడంతో ఉప కేంద్రానికి వచ్చే గర్భిణులకు మంచి నీళ్లు అందించలేకపోతున్నారు. ఈ రెండింటికీ కలిపి ఒక్కటే విద్యుత్తు మీటర్‌ను అమర్చడంతో బిల్లు చెల్లించేందుకు చిక్కులు తలెత్తుతున్నాయి. ఈ కేంద్రానికి సుమారు 2500 బిల్లు రావడంతో ఎవరూ కట్టకపోవడంతో విద్యుత్తు సరఫరాను విద్యుత్తు శాఖ నిలిపేసింది. ఇలా బిల్లులు కట్టని కేంద్రాలు ఇంకొన్ని ఉన్నాయని సిబ్బంది అంటున్నారు. చర్ల మండలంలోని ఉంజుపల్లి భవనానికి తాగు నీటి సమస్యతో పాటు ప్రహరీ లేదు. దుమ్ముగూడెం మండలం ములకపాడు కేంద్రానికి ప్రహరీ లేదు. పాత వాటితో పాటు కొత్త వాటిలోనూ మౌలిక సమస్యలు ఉండడం విశేషం.  జిల్లాలో నాలుగేళ్లలో సుమారు 400 శిశు మరణాలు ఉండగా 35కి పైగా మాతృ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు జాతీయ ఆరోగ్య సంస్థలు ఈ మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే క్షేత్రస్థాయిలో వైద్యం తక్షణం అందుబాటులోకి రావాల్సి ఉంది. మన్యంలో 267 ఆరోగ్య ఉప కేంద్రాలకు గాను గతంలోనే 86 చోట్ల పక్కా భవనాలు ఉన్నాయి. మూడేళ్ల కిందట సుమారు 100 నూతన భవనాలు మంజూరయ్యాయి. ఇంకా 88 చోట్ల అద్దె భవనాలలో సేవలు కొనసాగిస్తున్నారు. మంజూరైన వాటిలో 76 కేంద్రాలను ఇంజినీరింగ్‌ శాఖ తమకు అప్పగించినట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. మిగతావి అధికారికంగా ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అంగన్‌వాడీతో కలిసి ఉన్న ఉప కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయించగా ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలకు రూ.14 లక్షల చొప్పున నిధులు వచ్చాయి. ఈ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన నిధులు సకాలంలో రాకపోవడంతో రూ.లక్షల భవనాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. 225 ఏఎన్‌ఎంలకు 43 ఖాళీలున్నాయి. 267 రెండో ఏఎన్‌ఎంలకు 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కొన్ని చోట్ల రెండో ఏఎన్‌ఎంలే సబ్‌ సెంటర్లలో సేవలు అందించాల్సి వస్తోంది.

Related Posts