Highlights
- గ్రామ స్వరాజ్ అభియాన్‌గా జయంతి
- ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు వేడుకలు
- అణగదొక్కాలని చూసినా ఎదుగుదలకు
- తానే నిదర్శనం
- మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
- దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలే మనకు స్ఫూర్తి కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ రేడియో ప్రసంగం కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలతో తన మనోగతాన్ని పంచుకున్నారు. దేశ ప్రజలందరికీ ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ...అంబేద్కర్ సిద్ధాంతానికి తానూ ఓ ఉదాహరణగా ప్రధాని చెప్పారు. పేదవాడు తాను అనుకున్న దానిలో విజయం సాధించాలని అంబేద్కర్ కలలు కన్నారని, అది నేడు నిజమైందని, అందుకు తానే నిదర్శనమని స్పష్టం చేశారు.దేశంలో ఉపాధి పెరగాలంటే పారిశ్రామికీకరణ జరగాలని ఎన్నో ఏళ్ల క్రితమే అంబేద్కర్ చెప్పారని, నేటి మేకిన్ ఇండియా కార్యక్రమానికి అదే స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. దేశ విభజన, రెండో ప్రపంచ యుద్ధ సమయం, ప్రచ్ఛన్న యుద్ధం.. వంటి వాటి గురించి అంతా మాట్లాడుతున్న సమయంలో ఐక్యత గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని మోదీ చెప్పారు. సమాఖ్య స్ఫూర్తి, సమాఖ్య వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆయన గట్టిగా చెప్పారని, దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం పోటీతత్వంతో కూడిన సహకార సమాఖ్య వ్యవస్థను ఎంచుకుందని వెల్లడించారు. సరికొత్త భారతావనిని సృష్టించడానికి దేశప్రజలందరూ సహకరించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. వచ్చే 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయంపై దేశవ్యాప్తంగా గ్రామ స్వరాజ్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయం, ఆరోగ్యం, పంటల గిట్టుబాటు ధరలు, యోగా తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు.
దేశానికి వెన్నెముక లాంటి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు.భూమిని సాగు చేయడం మరిస్తే.. మనల్ని మనం మరచిపోయినట్లేనని గాంధీజీ చెప్పిన సూక్తిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు, మనిషి జీవనానికి వ్యవసాయం ఎంతో ప్రాముఖ్యమైనదని మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్, రామ్ మనోహర్ లోహియా వంటి వాళ్లు చెప్పారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర అందేలా చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. దాంతో పాటుగా పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను తీసుకొస్తోందని ఆయన తెలిపారు. 3000 జన్ ఔషది కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే 800 రకాల మందులు ప్రజలకు అందేలా చూస్తున్నామన్నారు. మోకాలి శస్త్రచికిత్స ధరను 50-70 శాతానికి తగ్గించామని, ఆయుష్మాన్ భారత్ కింద 10కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల చొప్పున బీమా అందేలా పథకాన్ని తీసుకొచ్చామని ప్రధాని మోడీ తెలిపారు.