తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్
బెంగళూరు జనవరి 3
భారత సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్ శుక్రవారం ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలతో వివిధ దేశాలకు చెందిన సైన్స్ ప్రముఖులతో ఏటా నిర్వహించే 'భారత సైన్స్ కాంగ్రెస్' మొదలైంది. బెంగళూరులోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం(యూఏఎస్బీ) వేదికగా ఈ నెల ఏడో తేదీ వరకు ఐదు రోజులపాటు సాగే ఈ 107వ సైన్స్ కాంగ్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రసాయనశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం పొందిన జర్మనీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టెఫాన్ హెల్(2014), ఇజ్రాయెల్ శాస్త్రవేత్త అడా ఇ.యోనథ్ (2009) సదస్సులో పాల్గొంటున్నారు. ఆహార భద్రతకు పర్యావరణ అనుకూల వ్యవసాయం, ఆహార, పోషక భద్రత కోసం పంటలను మెరుగుపరచడం, క్యాన్సర్ ఔషధ ఆవిష్కరణల్లో సవాళ్లు, అవకాశాలు, కృత్రిమ మేధ(ఏఐ), గ్రామీణ జనాభాలో వ్యాధుల వ్యాప్తి, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణాభివృద్ధి, ఇతర అంశాలపై ఈ వైజ్ఞానిక సదస్సులో చర్చలు ఉంటాయి. 'శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణాభివృద్ధి'పై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుందని, భారత సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నారని 'పీఐబీ' తెలిపింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం సమీకృత వ్యవసాయం, వస్థాపకత(ఎంట్రిప్రెన్యూయర్షిప్)లో రైతుల వినూత్న విధానాలు, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, ప్రకృతి పరిరక్షణ, రైతు సాధికారత, వ్యవసాయ రంగ సమస్యలు, విధానపరమైన అంశాలు సహా అనేక విషయాలపై ఈ నెల 6న జరిగే రైతు సైన్స్ కాంగ్రెస్ చర్చించనుంది.రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్), వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం(యూఏఎస్) శాస్త్రవేత్తలు, నిపుణులు, వినూత్న విధానాలతో వ్యవసాయానికి మేలు చేసిన రైతులు పాల్గొననున్నారు.