మహిళలపై దాడులు : బాబు ఆగ్రహం
విజయవాడ, జనవరి 3,
సకల జనుల సమ్మెలో భాగంగా మందడంలో నిరసన తెలియజేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా పక్కకు లాగేయడంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాజధాని గ్రామాల రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యాన్ని ఖండించారు. రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మందడంలో ఆందోళన చేస్తున్న రైతులపైకి పోలీసు వాహనాలను పోనిచ్చారని.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపైకి వాహనాలను నడిపి గాయాలపాలు చేయడం అప్రజాస్వామికమని అని ఆయన మండిపడ్డారు.వేలాది పోలీసులను గ్రామాల్లో దించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఇంత దారుణంగా హింసిస్తారా ? అని ప్రశ్నించారు. మందడంలో మహిళలను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తరలించడం అమానుషమని ఆవేదన చెందారు. రైతులు, మహిళలపై అక్రమ కేసులు తక్షణం ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. రైతులు, మహిళల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. మందడం గ్రామంలో మహిళా రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది.రోడ్డుకు అడ్డంగా నిల్చుని నిరసన తెలియజేస్తుండడంతో ట్రాఫిక్‌కి ఇబ్బంది కలుగుతోందని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ మహిళలు వినిపించుకోకపోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల్లో ఎక్కించేందుకు యత్నించారు. పలువురు మహిళలు వాహనాలకు అడ్డుగా పడుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సమయంలో పలువురు మహిళలకు గాయాలైనట్లు సమాచారం.