టాలీవుడ్ కు అమరావతి సెగ
హైద్రాబాద్, జనవరి 4
రాష్ట్రంలో ఏ ప్రజా ఉద్యమం జరిగినా.. మేధావులు, ప్రముఖ వ్యక్తుల మద్దతు అనేది కీలకంగా మారింది. గతంలో కాపుల ఉద్యమం జరిగినా.. అప్పట్లోనూ మేధావులు, ప్రముఖ వ్యక్తులు ముఖ్యంగా సెలబ్రిటీల మద్దతు కోసం ఆ వర్గం తహతహ లాడిపోయింది. సమాజంతో నిత్యం సంబంధ బాంధవ్యాలు నెరిపే ఇలాంటి వారు ఈ ఉద్యమాలకు మద్దతివ్వడం ద్వారా తాము అనుకున్నది సాధించుకుంటామనే భావన ఉద్యమకారుల్లోనూ, ఉద్యమాలకు నేతృత్వం వహించేవారిలోనూ బలంగా ఉండడమే దీనికి కారణం.తాజాగా ఏపీ రాజధాని అమరావతి రాజధాని తరలింపు విషయంలోనూ ఇదే తరహా డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం పది రోజులకు పైగానే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతున్నాయి. వీటికి ఇప్పటి వరకు రాజకీయ నేతలు మాత్రమే మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఇక్కడి ప్రజలు ఇప్పుడు సెలబ్రిటీ లపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి వీరు మద్దతు ఆశిస్తున్నారు. “రండి. మాకు మద్దతివ్వడండి..“ అని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వారు హెచ్చరికలకు కూడా దిగుతున్నారు.టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటివారు ఇప్పుడు గళం విప్పకపోతే.. వచ్చే నెలలో సంక్రాంతికి విడుదలయ్యే మీ సినిమాలను ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకుంటామని ఆందోళన కారుల నుంచి తీవ్ర హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ ఇరకాటంలో పడింది. మహేష్ బాబుకు గుంటూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పుడు ఆందోళనలు జరుగుతున్న నియోజకవర్గాలు గ్రామాల్లో కొన్ని గుంటూరు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. దీనికి సాక్షాత్తూ మహేష్ బావ గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.పైగా సూపర్ స్టార్ కృష్ణ జన్మించిన జిల్లా కూడా గుంటూరే. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం మహేష్ స్వస్థలం. అయితే, టాలీవుడ్ ఇప్పటి వరకు ఏ ఉద్యమానికీ మద్దతివ్వని విషయం కూడా ప్రస్తావనార్హం. గతంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం వరకు, అదే సమయంలో ప్రత్యేక హోదా నుంచి రాజధాని దీక్షల వరకు కూడా టాలీవుడ్ సినిమా చూసిందే తప్ప.. ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భం.. మద్దతుగా మాట్లాడిన ఉదంతం కూడా ఎక్కడా లేదు.మరి ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇప్పుడు స్పందిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కొసమెరుపు ఏంటంటే.. అల్లు అర్జున్ మేనమామ… మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతు ప్రకటించేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ మెగా మాటలను పక్కన పెడుతుందా? అనేది కూడా ప్రశ్నగానే మిగులుతోంది. ఏదేమైనా తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పాజిటివ్‌గా స్పందిస్తున్న టాలీవుడ్ వాళ్లు ఏపీ విషయంలో ఏం జరిగినా పట్టించుకోవడం లేదన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.