YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 నీరివ్వని మిషన్

 నీరివ్వని మిషన్

 నీరివ్వని మిషన్ (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, జనవరి 04 : ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులకు సాగునీరు అందుబాటులోకి తెచ్చి వారిని ఆదుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల వైఖరి కారణంగా చేపట్టిన అభివృద్ధి పనులు మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ‘మిషన్‌ కాకతీయ’ కింద ఉట్నూరు మండలంలో నిర్మించిన చెరువులు ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వ్యవసాయానికి అనుకూలమైన భూములుండి సాగునీరు లేక ఆందోళన చెందుతున్న గిరిజన రైతులకు ‘మిషన్‌ కాకతీయ’ ద్వారా చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా దశాబ్ధాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఉట్నూరు మండలంలోని నాగాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని శివ్‌సాగర్‌ చెరువు, లక్షిటిపేట పంచాయతీలోని తుకారామ్‌ చెరువుల అభివృద్ధికి నిధులను మంజూరు చేసింది. చిన్న నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఈ చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. నాగాపూర్‌ గ్రామంలో నిండుకుండను తలపించే శివసాగర్‌ చెరువును రూ.మూడు కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఏడాదిలో దాదాపు 80శాతం పనులు పూర్తి చేశారు. 2500 ఎకరాలు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలన్న ఆశయంతో చేపట్టిన ఈ చెరువు పనులపై ఇంజినీర్ల పర్యవేక్షణ కరవవడంతో కాంట్రాక్టర్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చారు. నాసిరకమైన ఇసుక, కంకర, సిమెంట్‌ తదితర సామగ్రి ఉపయోగించడంతో ఇది మున్నాళ్ల ముచ్చటగా మారింది. పనులపై నిర్మాణ దశలోనే రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. చెరువును అభివృద్ధి చేసి నాగాపూర్‌తోపాటు శ్యాంపూర్‌, గోదరిగూడ, ఎక్స్‌రోడ్‌, చీమనాయక్‌తండా, హీరాపూర్‌, హస్నాపూర్‌ తదితర గ్రామాలకు చెందిన రైతులకు సాగునీరు అందించేందుకు రెండు కిలోమీటర్ల పొడవున కుడి కాలువ పనులు చేపట్టారు. బుడుందేవ్‌ వాగుపై ఫ్లైఓవర్‌గా నిర్మించిన అక్విడెక్టులకు పగుళ్లు వచ్చాయి. కాలువ బీటలు వారింది. నిర్వహణలేక ఎడమ కాలువ అస్తవ్యస్తంగా మారింది. పనుల్లో నాణ్యత లోపించడంతో ఎక్కడికక్కడే లీకేజీ అవుతోంది. లక్షిటిపేట గ్రామంలో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టిన తుకారామ్‌ చెరువు అప్పుడే శిథిలావస్థలో దర్శనమిస్తోంది. నిర్మించిన పనుల్లో మచ్చుకైనా నాణ్యతలేకపోవడంతో పనులు చేసిన కొద్ది కాలానికే ఎక్కడికక్కడే పగుళ్లు తేలాయి. 60 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ చెరువు పనులు సక్రమంగా జరగలేదు. చెరువులోని మట్టి తొలగింపు, కట్ట మరమ్మతులు, అలుగు, కాలువ పనులు నాసిరకంగా చేపట్టడంతో పగళ్లు తేలాయి. తుకారామ్‌ చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన అలుగుకు ఏడాదికే గండిపడింది. నాసిరకంగా నిర్మించడంతో నీటి ప్రవాహానికి పెచ్చులూడి కొట్టుపోయింది. పక్కనున్న రైతుల చేన్లలో ఒక్కసారిగా నీరు ప్రవహించి పంటలకు నష్టం వాటిల్లింది. కాలువ, చెరువు పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం సరిగ్గా 30 ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది.

Related Posts