YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 పత్తి పంట సాగు కొరత

 పత్తి పంట సాగు కొరత

 పత్తి పంట సాగు కొరత
అదిలాబాద్, జనవరి 6,
 ఏడాది క్రితం ప్రభుత్వం పత్తి సాగు తగ్గించడంతో రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. దీన్నే నమ్ముకున్న రైతులు పత్తి సాగు చేయగా అధిక ధరలు లభించాయి. ఈసారి ఖరీఫ్‌లో భారీ స్థాయిలో రైతులు పత్తి పంట సాగు చేశారు. దిగుబడులు రాక ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు.ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు ధరల రూపంలో ఎప్పుడూ నష్టాలే మిగులుతున్నాయి. యాసంగి సాగు కోసం వ్యాపారుల వద్ద ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పొందేందుకు పంటను అమ్మక తప్పలేదు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు కుమ్మక్కయి ధరలను అదే స్థాయిలో కొనసాగించి కొనుగోలు చేపట్టి నిల్వ చేశారు. అంతర్జాతీయ విపణిలో ధరలు కలిసి వస్తుండటంతో వ్యాపారుల పంట పండుతోంది. పంట అమ్ముకున్న రైతు నష్టపోగా వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు గడించారు. గులాబి పురుగు సోకి దిగుబడులు తగ్గాయి. రైతులు పత్తి పంటను తొలగించడంతో విపణికి పత్తి ఉత్పత్తులు వచ్చే వీలు లేకపోవడంతో ధరలు మరింత పెరగనున్నాయి. దీనికి తోడు గులాబి పురుగు రైతులను నట్టేట ముంచింది. రైతులు పత్తి నంతా అమ్ముకున్నాక ప్రస్తుతం అమాంతంగా ధరలు పెరిగాయి. విపణిలో క్వింటా రూ.5,200 వరకు పలుకుతోంది. పెరిగిన ధరలతో పంట పడిన రైతుకన్నా పంట కొనుగోలు చేసిన వ్యాపారులకే ‘తెల్లబంగారం’ అయ్యింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు క్వింటా సరాసరి రూ.800-1000 కోల్పోగా రూ.190 కోట్లు నష్టపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మునుపెన్నడూ లేనంతగా భారీ విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో, నిర్మల్‌ జిల్లాలో 1.36 లక్షల హెక్టార్లలో, మంచిర్యాల జిల్లాలో 64 వేల హెక్టార్లలో, కుమురం భీం జిల్లాలో 62 వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు కేవలం 19 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే విపణికి వచ్చింది. మొదట్లో పత్తి ధర రూ.4,200 పలికింది. ఆదిలాబాద్‌, భైంసా పట్టణాల్లో కొనుగోళ్లు ప్రారంభించి రూ.4,100-4200 వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోళ్లు జరిపారు. ఇది వరకే రైతులు పండించిన పంటను అమ్ముకున్నారు. రైతుల వద్ద పత్తి నిల్వలు నిండుకున్నాక ఇటీవల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం క్వింటా ధర రూ.5,200 వరకు పలుకుతోంది. పత్తి నాణ్యంగా ఉండటం మార్కెట్లో క్యాండి ధర రూ.42 వేల వరకు పలుకుతుండటంతో పత్తికి డిమాండు ఏర్పడింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఖరీఫ్‌ మొదట్లో ఆశాజనకంగా ఉన్న పత్తి పంటలు సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కలుపు మొక్కలు పెరిగిపోయాయి. మొదట్లో అతి కష్టం మీద కలుపు తీయించినా భారీ వర్షాలు, వరదలకు రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో నామమాత్రంగా ఎకరానికి ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. మొదట్లో రైతులంతా తాము పండించిన పత్తిని రూ.4,100-4200 ధరలకు అమ్ముకున్నారు. ఇప్పుడు రూ.5200 పైగా పెరగడంతో ఒక్కో రైతు ఎకరానికి రూ.5000-6000 మేర నష్టపోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కలేదు. విపణిలో పత్తికి మద్దతు ధర రూ.4150 ఉండగా ప్రస్తుతం రూ.5200 వరకు ధరలు లభిస్తున్నాయి. క్వింటా రూ.1100 మేర అధికంగా ఉంది.ఆదిలాబాద్‌ విపణిలో 23 లక్షల క్వింటాళ్ల పత్తి లక్ష్యం కాగా 14 లక్షల క్వింటాళ్లు, నిర్మల్‌ జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల లక్ష్యం కాగా 3.10 లక్షల క్వింటాళ్లు, కుమురంభీం జిల్లాలో 5 లక్షల క్వింటాళ్ల లక్ష్యం కాగా 1.65 లక్షల క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో రెండు లక్షల క్వింటాళ్ల లక్ష్యం కాగా 1.10 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిపారు.

Related Posts