YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
న్యూఢిల్లీ, జనవరి 9    
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీని అమెరికా దళాలు హతమార్చడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆధునిక ఇరాన్ చరిత్రలో తొలిసారిగా జంకారా మసీద్ గుమ్మటంపై ఎర్ర జెండాను ఎగరేశారు. మసీదు పైభాగంలో ఎర్ర జెండా ఎగరేయడం యుద్ధం రాబోతున్నది అనడానికి సంకేతంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం 2015 నుంచి అగ్రరాజ్యం ఇప్పటికే వైదొలగింది. ఈ ఒప్పందంలో కీలక నిబంధన నుంచి సైతం తాము వైదొలగుతున్నట్టు ఇరాన్ ప్రకటించింది.అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన తర్వాత ఇరాన్ ఒక్కో నిబంధనను అతిక్రమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక, యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని ఎత్తేసినట్టు పేర్కొంది. అంతేకాదు, అమెరికా సేనలు తమ భూభాగం విడిచి వెళ్లాలని ఇరాక్ పార్లమెంట్ ప్రకటించింది. తమ దేశ అణు కార్యక్రమంపై ఎలాంటి పరిమితులు లేవని వెల్లడించడంతో అణు ఒప్పందం నుంచి ఇరాన్‌ పూర్తిగా బయటకు వచ్చినట్టయ్యింది. ఇరాన్ నిర్ణయం వల్ల యురేనియం శుద్ధి, దాని స్థాయిలు, అణు పరిశోధన వంటి అంశాల్లో ఆ దేశంపై ఇక ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే, విద్యుత్తు ఉత్పత్తి వంటి దేశ సాంకేతిక అవసరాల మేరకే తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంఘానికి తమ సహకారం కొనసాగుతుందని వెల్లడించింది.ఇరాన్‌ నిర్ణయంపై ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, చైనా విచారం వ్యక్తం చేశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తగ్గింపునకు కృషి చేస్తామని, ఈ మేరకు మూడు దేశాల అధినేతలు చర్చలు జరిపినట్లు జర్మనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతానికి ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ఇరాన్‌ నిర్ణయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి.. ఈ అంశంపై ఆ దేశ విదేశాంగ మంత్రితో మరింత లోతుగా చర్చిస్తామని పేర్కొంది. తాజా పరిణామాలు అణు బాంబుల తయారీకి ఇరాన్‌ ప్రయత్నించడమేకాదు, ఇస్లామిక్ ఉగ్రవాదులు తిరిగి ఇరాక్‌లోకి రావడానికి వీలు కల్పిస్తుంది. దీంతో మధ్య ప్రాచ్యం మరింత ప్రమాదకర, అస్థిర ప్రదేశంగా మారుతుంది.ఉద్రిక్తతల నడుమ.. తమ దళాలను ఇరాక్ భూభాగం నుంచి బహిష్కరిస్తే గతంలో ఎన్నడూ చూడని ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు ఇరాక్ నుంచి బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాటానికి సహకరించే 5,200 మంది అమెరికా సేనలు సహా తమ భూభాగం నుంచి విదేశీ సైన్యాన్ని పంపేయాలన్న తీర్మానానికి ఇరాక్ ప్రజాప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అణ్వస్త్రాలను ఇరాన్‌ సమకూర్చుకోకుండా నిలువరించే సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఐరాస భద్రతామండలిలోని శాశ్వత సభ్య దేశాలతో పాటు జర్మనీ, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ప్రతినిధులు, టెహ్రాన్‌ నేతలు కలిసికట్టుగా 2015లో రూపొందించారు. ఈ ఒప్పందం ప్రకారం అణు శుద్ధి, శుద్ధి స్థాయి తదితరల అంశాలపై పరిమితులు ఉంటాయి. కానీ, ఈ ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉందని, అమెరికాకు నష్టం కలిగించేదిగా ఉందని ఆరోపిస్తూ 2018లోనే ట్రంప్ వైదొలిగారు.

Related Posts