YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కంటికి వెలుగు

కంటికి వెలుగు

కంటికి వెలుగు (వరంగల్)
వరంగల్, జనవరి 07 ): కంటివెలుగు కార్యక్రమం మరోసారి ఊపందుకోనుంది. 2018లో ప్రారంభమై అంసపూర్తిగా ఉన్న ఈ కార్యక్రమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అప్పట్లో  అవసరమైన వారికి కళ్ల అద్దాలు అందించింది. కానీ అనివార్య కారణాలతో శస్త్రచికిత్సలు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేయిస్తోంది. ప్రణాళిక ప్రకారం గ్రామాల వారీగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. చాలా మంది తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కంటిచూపు సమస్యలున్న వారికి అక్కడికక్కడే కళ్ల అద్దాలు అందజేశారు. అవసరమున్న ప్రిస్క్రిప్షన్‌ అద్దాలు తెప్పించి ఇచ్చారు. శస్త్రచికిత్సల కోసం సిఫారసు చేశారు. కానీ ఆపరేషన్లు చేయడంలో జాప్యం జరిగింది. ఇప్పుడు కంటి శుక్లాలు, ఉన్నత స్థాయి శస్త్ర చికిత్సలు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల నుంచి వివిధ ఆసుపత్రుల్లో దశల వారీగా శస్త్రచికిత్సలు చేస్తారు.  2018 ఆగస్టులో కంటిచూపు పరీక్షలు ప్రారంభించి మార్చి వరకు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా శస్త్రచికిత్సలు అవసరమున్న వారిని వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌ల్లోని పలు ఆసుపత్రులకు సిఫారసు చేశారు. విడతల వారీగా జరుగుతాయని, సూచించిన తేదీల్లో దవాఖానాలకు వెళ్లాలని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాకే ఆపరేషన్లు చేయిస్తామని పేర్కొనడంతో బాధితులు నిరాశ చెందారు. శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో వారి ఎదురుచూపులకు తెర పడింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,15,025 మందికి ప్రయోజనం కలగనుంది. వీరందరికీ త్వరలో శస్త్రచికిత్సలు జరుగుతాయి. ఆపరేషన్ల నిర్వహణపై త్వరలోనే విధివిధానాలు వెలువడనున్నాయి. డీఎంహెచ్‌ఓలు, ఇతర వైద్యులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అందులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు థియేటర్లు, ఇతర సౌకర్యాలకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా సిబ్బందిని కూడా సమకూర్చుకునే పనిలో ఉన్నారు. త్వరలోనే బాధితులకు సమాచారం అందించి వారికి కేటాయించిన తేదీల్లో శస్త్రచకిత్సలు నిర్వహిస్తారు.

Related Posts