అమెరికా భద్రతా దళాలు మొత్తం ఉగ్రవాదులే: ఇరాన్
తెహ్రాన్ జనవరి 7
అమెరికా భద్రతా దళాలు మొత్తం ఉగ్రవాదులే అని ఇరాన్ ప్రకటించింది. మిలిటరీ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమానీని డ్రోన్ దాడితో అమెరికా హత్య చేసిన నేపథ్యంలో ఇరాన్ ఇవాళ ఈ ప్రకటన చేసింది. మేజర్ జనరల్ సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇవాళ కీర్మన్ పట్టణంలో సులేమానీ అంత్యక్రియలు నిర్వహించారు. సులేమానీ సొంత ఊరు కీర్మన్. అక్కడే ఇవాళ సులేమానీ పార్గీవదేహాన్ని ఖననం చేయనున్నారు. సులేమానీ శవపేటికతో గత మూడు రోజుల నుంచి పలు నగరాల్లో ఇరాన్ ప్రజలు అంతిమయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై లక్షిత దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. అమెరికా భద్రతా బలగాలు మొత్తం ఉగ్రవాదులంటూ ఇరాన్ పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేశారు. కొత్త బిల్లు ప్రకారం అమెరికా దళాలు, పెంటగాన్ ఉద్యోగులు, దాని అనుబంధ సంస్థలు, ఏజెంట్లు, కమాండర్లు అందరూ ఉగ్రవాదులే అంటూ ఇరాన్ తీర్మానించింది. సులేమానీ హత్యకు పాల్పడినవారంతా ఉగ్రవాదులంటూ బిల్లులో పేర్కొన్నది.