ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం 180మంది మృతి
తెహ్రాన్ జనవరి 8
;యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇరాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. దాదాపు 180మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ దేశానికి చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్ప కూలింది. టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్ పోర్టు వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో ఇందులో ప్రయాణిస్తున్న 180మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఏ ఒక్కరూ బతికి బట్టకట్ట లేదని తెలిపింది.సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. విమానం టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన కొద్ది క్షణాల్లోనే దానికి రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే విమానం కుప్పకూలింది.విమానం కూలి పోయిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్టు చేయడం తో వైరల్ గా మారింది. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్టు వీడియో ఫుటేజీ లో కనిపిస్తోంది. విమానం పూర్తిగా కాలి పోయిందని మీడియా తెలిపింది. ఘటనలో విమానంలోని వారంతా మరణించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు.అయితే అమెరికాపై ఇరాన్ దాడుల నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థ ప్రమాదవ శాత్తూ కూల్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.