జగన్ ఆస్తుల కేసులో సీబీఐ మరో ట్విస్ట్
విజయవాడ, జనవరి 9
జగన్ ఆస్తుల కేసులో సీబీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. వాన్‌పిక్ కేసులో మాజీ మంత్రి ధర్మానపై ఉన్న ఆరోపణలపై విచారణ చేపట్టొచ్చని కోర్టుకు సీబీఐ నివేదించింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదుచేసిన అభియోగాలను విచారణకు స్వీకరించాలని కోరింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ అనుమతి లేకపోవడం వల్ల అభియోగాలను విచారణకు స్వీకరించకుండా సీబీఐ కోర్టు పక్కనపెట్టిందని.. అనుమతి అవసరం లేదని తెలిశాక విచారణకు స్వీకరించిందని.. ఇందులో స్వీయ ఉత్తర్వులను పునఃసమీక్షించలేదన్న విషయాన్ని గుర్తు చేసింది.జగన్ ఆస్తుల వ్యవహారంలో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన కూడా ఉన్నారు. అయితే పీసీ యాక్టు కింద ఆయనపై అభియోగాలను విచారణకు స్వీకరించాలంటే ప్రభుత్వ నుంచి అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో అభియోగాలను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.2014 ఎన్నికల్లో ధర్మాన ఓడిపోయారు.. దీంతో ఆయనపై పీసీ యాక్టు కింద అభియోగాల విచారణకు అనుమతి అవసరం లేదని.. విచారణకు స్వీకరించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. కోర్టు కూడా స్వీకరించింది. ఈ నిర్ణయాన్ని ధర్మాన హైకోర్టులో సవాల్ చేయగా.. హైకోర్టు సీబీఐ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకు వెళ్లగా.. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. తర్వాత ధర్మాన హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.