చక్రబంధంలో చంద్రబాబు
విజయవాడ, జనవరి 10,
జగన్ రాజకీయ వ్యూహాల ముందు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తెలివి వెలవెలబోతోంది. మూడు రాజధానులతో టీడీపీ రాజకీయ ఉనికికే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్న జగన్ ఇపుడు మరో ఉచ్చులో ఏపీ విపక్ష రాజకీయాన్ని సాధించాలను కుంటున్నారుట. మూడు రాజధానుల విషయంలో తాను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నానన్న విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతూనే ఈ విషయంలో నానా యాగీ చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను కార్నర్ చేయడానికి పెద్ద స్కెచ్ గీశారని అంటున్నారు. ఇక హై పవర్ కమిటీ నివేదిక తరువాత అఖిల పక్షం భేటీ నిర్వహించేందుకు జగన్ రెడీ అవుతున్నారుట.అఖిల పక్ష సమావేశం పేరిటా ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ఇతర సంస్థలను పిలవకూడదని జగన్ భావిస్తున్నారుట. వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ మీటింగు పెట్టి కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చిపెట్టుకోవడం అన్న ధోరణిలో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీ రాజకీయాల్లో వీరి ప్రాతినిధ్యం ఎంతో, అస్థిత్వం ఏంటో తెలియదు కానీ మీటింగు పెడితే రచ్చ చేస్తారని దాని వల్ల అసలు ఉద్దేశ్యాలు మరుగున పడతాయని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇక కేవలం ఏపీలోని రాజకీయ పార్టీల నాయకులకు మాత్రమే అఖిలపక్షాన్ని పరిమితం చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అంతే కాకుండా పార్టీ అధినేతలే కచ్చితంగా రావాలని కూడా షరతు పెడతారని తెలుస్తోంది. దీని వల్ల ఆయా పార్టీల అధ్యక్షులు మీటింగుకు వచ్చి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినా కూడా అది వారికే మైనస్ అవుతుందన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడితే మిగిలిన రెండు ప్రాంతాలలో వారు చెడ్డ అవుతారని, అలా అఖిలపక్షం వేదికగా విపక్షాన్ని అడ్డంగా బుక్ చేయవచ్చునని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.జగన్ తో కేవలం అసెంబ్లీ సమావేశాలకే తప్ప వేరే విధంగా కనీసం ఎదురుపడని చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. అదే జరిగితే అఖిలపక్షం మీటింగు కూడా చిన్న సైజ్ అసెంబ్లీగానే మారుతుందని అంటున్నారు. ఇక ఇప్పటివరకూ పవన్, జగన్ ఎదురుపడిన ఘటనలు లేనేలేవు. అఖిలపక్షానికి పవన్ నే డైరెక్ట్ గా పిలవాలని, జనసేన అభిప్రాయాన్ని పక్కా క్లారిటీగా రికార్డ్ చేయించాలని జగన్ పట్టుదలగా ఉన్నారట. మరి పవన్ ఈ భేటీకి వస్తారా. వచ్చి ఏం మాట్లాడుతారు అన్నది కూడా ఇప్పటికైతే ఆసక్తికరమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.